calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచ గచ్చిబౌలి వెనుక వేలకోట్ల స్కాం

09-04-2025 01:18:12 AM

ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది

రేపోమాపో వెల్లడిస్తా

వరంగల్ సభకు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకెళతాం

మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల వెనక వేలకోట్ల భూబాగోతం ఉందని, దీని వెనక బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంద ని, ఆ వివరాలు రెండు,మూడు రోజుల్లో చెప్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వెల్లడించారు.

మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు..ఏఐ వీడియోల పేరుతో రేవంత్ సర్కార్ హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారంలో తప్పించు కోవాలని చూస్తోందని, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని తాము కూడా అనొచ్చన్నారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలో ఉందని, ఒకరు చెప్పులు మోస్తే, మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ సీఎంగా మిగిలిపోయారని, అందుకే పాలనలో కాంగ్రెస్ పెద్దల జోక్యం మితిమీరుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారం లోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా మంత్రివర్గాన్ని కూడా విస్తరించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో నెగిటివ్ పాలసీలు, నెగిటి వ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు. మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం స్థాయి వ్యక్తులపై కేసులు ఎలా పెట్టాలా అనే ఆలోచనలు తప్ప పాలనపై దృష్టిపెట్టడం లేదన్నారు. 

అమెరికా పన్నులతో రాష్ట్రానికి నష్టం..

అమెరికా సుంకాలతో తెలంగాణకు నష్టం జరగనున్నదని, ఫార్మా, ఐటీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపబోతోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లిక్కర్‌పై వచ్చే ఆదాయం తప్ప మరే ఆదాయం లేదన్నారు. అమెరికా విధించిన పన్నులపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించపోవడం సరికాదన్నారు. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే పెట్రోల్ ధరలు పెంచడం దారుణమని మండిపడ్డారు.

కోర్టుకెళ్లయినా పర్మిషన్ తెచ్చుకుంటాం

వరంగల్ సభకు భారీఎత్తున ప్రజ లు రాబోతున్నారన్నారు. పోలీసు అనుమతికి ఇప్పటికే దరఖాస్తు చేశామని, ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టుకెళ్లి తెచ్చుకుంటామని తెలిపారు. ప్రజలను తరలించేందుకు మూడువేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏర్పాట్లపై జిల్లాల వారీగా కేసీఆర్ రివ్యూలు నిర్వహించారని, నేతలంతా సభ విజయవంతంపై దృష్టి సారించారన్నారు. సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలో చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పా రు. జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు శిక్షణా తరగతులు త్వరలో చేపడుతామన్నారు.