calender_icon.png 16 January, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలకు అభయహస్తం

21-12-2024 12:00:00 AM

దేశంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిత్యం తాపత్రయపడుతూనే ఉంటుంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని, వారు ఉన్నతమైన విద్యను అభ్యసించాలని కాంగ్రెస్  పార్టీ నిత్యం కోరుకుంటోంది. దానికి ప్రతిరూప మే తెలుగు నేలపై తొలి గురుకులానికి అం కురార్పణ జరిగింది.

మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు స్వర్గీయ పీవీ నరసింహారావు ఆధ్వర్యంలోనే గురుకులాలకు నాంది జరిగిందని చెప్పుకోవడం మాకు గర్వంగా ఉంది. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీవీ నరసిం హారావు నల్లగొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌లో మొట్టమొదటి గురుకులాన్ని ప్రారంభించి తెలుగునాట బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అదే స్ఫూర్తితో  నేటి వరకు ఆ ఒరవడినే కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తెలంగాణలో పలు విప్లవాత్మక నిర్ణయాల ను తీసుకుంటోంది. నూతన తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురైనట్టే గురుకులా లు, సంక్షేమ వసతి గృహాలు కూడా నిర్లక్ష్యానికి గురైనాయి. నాటి పాలకుల తప్పి దాలను సరిదిద్దుతున్న ప్రస్తుత సర్కార్ విద్యార్థుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టింది.

  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధు లు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల ల్లో, హాస్టళ్లలో పర్యటించి పేద విద్యార్థుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి నిరూపించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ‘కామ న్ డైట్’ ప్రారంభోత్సవాలను ఒక పండుగలా నిర్వహించి వారందరితో కలిసి భోజ నం చేసి ‘మీకు మేము తోడున్నాం’ అం టూ వారిలో భరోసాను కల్పించారు.

ఒకే తరహా పోషకాహారం

తెలంగాణలోని 3900 సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఉండేలా ఈ కామన్ డైట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థులకు రుచికరమైన పోషకాహార భోజనం అందించేందుకు బీఆర్‌ఎస్ పాలనలో నామమాత్రంగా ఉన్న డైట్ చార్జీల ను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వస్తు న్న వార్తలపై ఎలాంటి భేషజాలకు పోకుం డా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యత వహించి వాటి పరిష్కారానికి కృషి చేస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకొంది.  

గురుకులాల్లో, హాస్టళ్లలో నిధుల లేమి తో ఇబ్బందులు పడకుండా ప్రతినెలా పదో తేదీలోపు బిల్లులు మంజూరయ్యేలా గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాక మెస్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేసింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందే లా స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్ సాంకేతికతతో ఆధునిక శిక్షణా కేంద్రాలు, యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు ఏర్పాటు చేసి, గురుకులాలను నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.

రాష్ట్ర యువత కోసం ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్‌వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ విశ్వవిద్యాల యం బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థులకు సోపానాలుగా మారనున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ఈ సానుకూల చర్యలతో సంక్షేమ వసతి గృహాల్లో 3 నుం డి 7వ తరగతి చదువుతున్న 2.77లక్షల మందికి, 8 నుండి 10వ తరగతి చదువుతున్న 2.59 లక్షల మందికి, ఇంటర్ నుం డి పీజీ వరకు చదువుతున్న 2.28 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం మా ప్రభుత్వ ఘనతగా భావిస్తున్నాం.

ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలు

కేసీఆర్ పాలనలో వివక్షతో వెనుకబాటుకు గురైన గురుకులాలు, సంక్షేమ హాస్ట ళ్లకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు  కాం గ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు తమ వైఫల్యాలు ఎక్కడ బయటపడుతాయనే భయంతో ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. బీఆర్‌ఎస్‌తో తెరచాటున దోస్తీ చేస్తున్న బీజేపీ కూడా వీరికి తోడయ్యింది.

ఈ పార్టీల అస త్య ప్రచార ఆరోపణలతో  విద్యార్థుల్లో అభద్రతాభావం ఏర్పడకుండా ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకొని, అందులో భాగంగా  విద్యార్థులతో మమేకం కావడంతో ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యాయి. సీఎం మొదలుకొని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ యంత్రంగా మొత్తం గురుకులాలు, వసతి గృహాలను ఒకే రోజు సం దర్శించడంతో విద్యార్థుల్లో  ప్రభుత్వంపై విశ్వాసం రెండింతలైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నిర్ణయాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిపో యి చిన్నారుల జీవితాలతో ఆటలాడుతూ కుట్రలకు తెరదీయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

పదేళ్లు ఏకచ్ఛత్రాధి పత్యంతో గురుకులాల్లో, హాస్టళ్లలో తమకు కావాల్సిన వారిని భర్తీ చేసుకున్న బీఆర్‌ఎస్ నేతలు పదవి కోల్పోగానే దిక్కుతోచని స్థితిలో కొన్ని చోట్ల విద్యార్థులను ఫుడ్‌పా యిజన్ పేరుతో రెచ్చగొడుతూ ప్రభుత్వా న్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం  ఇలాంటి దురదృష్టకర ఘటనలపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెట్టాలనే కృతనిశ్చయంతో ఉండడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

బీఆర్‌ఎస్ హయాంలో  కోకొల్లలు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలం టూ బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు చేయడాన్ని తల్లిదండ్రులు, తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో  ఇబ్బందులు పడిన విద్యార్థులు గత ఘటనలను గుర్తుతెచ్చుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. కేసీఆర్ పాలనలో మెనూ సూచికలు బోర్డులకే పరిమితమయ్యేవి. వారి హయాంలో నాసిరకం ఆహా రంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఘటనలు వార్త్తాపత్రికల్లో నిత్యం పతాక శీర్షి కలయ్యేవి.

తమకు జరిగిన అన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే  సిబ్బందిచే నిత్యం బెదిరింపులు, దౌర్జన్యాలు ఆ నాడు పరిపాటి అయ్యాయి. దీంతో విద్యార్థులు ఇటు ఆ బాధలను భరించలేక, అటు తల్లిదండ్రుల కు చెప్పుకోలేక మానసిక క్షోభను అనుభవించేవారు.  ఒక విద్యార్థి నాయకుడిగా హాస్టళ్లలో విద్యార్థ్ధులు ఎదుర్కొనే కష్టాలు ప్రత్యక్షంగా నాకు తెలుసు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మచ్చుకు కొన్ని  ఘటనలను పరిశీలిస్తే, ఆ ప్రభుత్వం విద్యార్థులపై ఎంత నిర్లక్ష్యంగా ఉండేదో అర్థమవుతుంది.

సిద్దిపేట మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో 128 మంది,  నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 500 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో200 మంది, గద్వాల జిల్లా గట్టు మండలంలో బాలిక ల గురుకులంలో 100 మంది.. ఇలా అనేక హాస్టళ్లలో వందలాది మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురయ్యారు. దురదృష్టవశాత్తు కొన్ని ఘటనల్లో సకాలంలో వైద్యం అందక మృతులు కూడా ఉన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇలాంటి జాబి తా తీసుకుంటే పెద్ద గ్రంథమే అవుతుంది.

పదేళ్ల పాలనలో గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను అస్తవ్యస్తం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకొన్న బీఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంటే విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న సంక్షేమాలపై కుట్ర లు పన్నుతూ బురదజల్లడమే లక్ష్యంగా విమర్శిస్తున్న బీఆర్‌ఎస్‌లో మార్పు రాకపోతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతూ తరిమికొట్టడం ఖాయం.

- వ్యాసకర్త టీపీసీసీ అధ్యక్షుడు