calender_icon.png 18 October, 2024 | 5:03 AM

కబ్జా కోరల్లో తాళ్లచెరువు

18-10-2024 12:43:32 AM

  1. 11 ఎకరాల చెరువు ఇప్పుడు ఆరెకరాలైంది
  2. గ్రామస్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

చేర్యాల, అక్టోబర్ 17: గ్రామీణ జీవన విధానంలో చెరువులకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెరువుల కిందనే అధికంగా సాగు భూమి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత చెరువు కబ్జాకు గురవుతుంటే పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కొమురవెల్లి మం డలం ఐనాపూర్ పరిధిలో ఒకప్పుడు 11 ఎకరాలు ఉన్న తాళ్లచెరువు ఇప్పుడు ఆరెకరాలకు పరిమితమైంది. చెరువు పరిధిలో సుమారు 50 ఎకరాల ఆయకట్టు ఉండగా, చెరువు కబ్జాకు గురికావడంతో ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొన్నది.  చెరువు కబ్జాపై అనేకసార్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నా రు.

రెండు సంవత్సరాల క్రితం తాళ్లచెరువు మిషన్ సరోవర్ పథకానికి ఎంపిక కాగా రూ.6.56 లక్షలతో పూడికతీత పనులు ప్రా రంభమయ్యాయి. కానీ, పనులు ముం దుకు సాగకుండా కబ్జాదారులు అడ్డుకున్నారని తెలిసింది. చెరువు కబ్జాపై ఇరిగేషన్ ఏఈ శశిధర్‌రెడ్డిని వివరణ కోరాగా.. తాను సెలవులో ఉన్నానని, మళ్లీ ఛార్జి తీసుకోగానే చెరువు పరిధిలో సర్వే చేపట్టి, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు.

హద్దులు ఏర్పాటు చేయాలి

కబ్జాకు గురైన తాళ్లచెరువుపై అధికారులు విచారణ చేపట్టాలి. సర్వే చేసి చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను గుర్తించాలి. తద్వారా హద్దులు  ఏర్పాటు చేయాలి. ఇప్పటికే అనేకసార్లు మేం  అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు కబ్జాదా రులకు కొమ్ముకాయడంతోనే చెరువు అన్యాక్రాంతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.

 చెరుకు రమణ, 

గ్రామస్థుడు, ఐనాపూర్