calender_icon.png 29 September, 2024 | 4:59 AM

దద్దరిల్లిన చెపాక్

22-09-2024 12:00:00 AM

భారత్, బంగ్లా తొలి టెస్టు

  1. శతకాలతో చెలరేగిన పంత్, గిల్ 
  2. బంగ్లాదేశ్ టార్గెట్ 515 పరుగులు 
  3. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్

చెన్నై స్టేడియాన్ని పరుగుల సునామీ ముంచెత్తింది. రెండు రోజులుగా చప్పగా సాగుతున్న టెస్టులో మూడోరోజు పంత్, గిల్ శతకాలతో చెపాక్ స్టేడియం దద్దరిల్లింది. పరుగుల దాహం తీర్చుకోవడంతో పాటు బంగ్లా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచి భారత్ గెలుపుకు బాటలు వేశారు.  విజయానికి కేవలం ఆరు వికెట్ల దూరంలో నిలిచిన టీమిండియా తొలి టెస్టులో గెలవడం నల్లేరు మీద నడకే..!

చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా సా గుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట ర్లు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 515 పరుగుల భారీ టార్గెట్‌ను ఉం చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 158 పరు గులు చేసింది. కెప్టెన్ షాంటో (51*), షకీబ్ (5*) క్రీజులో ఉన్నారు.

విజయానికి 357 పరుగుల దూరం లో ఉన్న బంగ్లా చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడంలో విఫలమైన లోకల్ బాయ్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగుతున్నాడు. తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీశాడు.  మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో టీమిండియా విజయం లాంచనప్రాయమే. తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసి భారత్ భారీ విజయాన్ని అందుకునే అవకాశముంది.

సెంచరీల మోత..

81/3 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు పంత్, గిల్ శుభారంభం ఇచ్చారు. జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పెంచుతూ పోయారు. గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు)  కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ పంత్ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 3 వికెట్ల నష్టానికి 205 పరుగులతో టీమిండియా లంచ్ విరామానికి వెళ్లింది. లంచ్ అనంతరం పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) టెస్టుల్లో ఆరో సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే పంత్ ఔట్ కావడంతో 167 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ (22 నాటౌట్) వేగంగా ఆడాడు. ఈ దశలో గిల్ 161 బంతుల్లో టెస్టుల్లో నాలుగో సెంచరీ సాధించాడు. 

అశ్విన్ మాయాజాలం..

తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కాస్త నిలకడను ప్రదర్శించింది. తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం జాకిర్ హసన్ (33)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాంటో వేగంగా ఆడడంతో బంగ్లా స్కోరు పరిగెత్తింది.ఈ దశలో బంతిని అందుకున్న అశ్విన్ తన స్పిన్ మాయాజాలన్ని ప్రదర్శిస్తూ షాద్‌మన్ ఇస్లామ్ (35), మోమినుల్ హక్ (13), ముష్ఫికర్ రహీమ్ (13) బుట్టలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా అరగంట ముందే ఆటను నిలిపివేశారు.