calender_icon.png 17 November, 2024 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్గి పిడుగై ఎగిసిన అల్లూరి

03-07-2024 12:00:00 AM

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్ర సమరంలో మహావీరులు ఎందరో ఉన్నారు. వారిలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల శ్రేయస్సుకై అహర్నిశలూ శ్రమించి వారి పాలిట దైవంగా ప్రశంసలు అందుకొన్నా డు. అనేక ఉద్యమాలు, తిరుగుబాట్లతో తెల్లదొరలకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఆ విప్లవజ్యోతి 27 ఏళ్లకే తన ప్రాణాల్ని అర్పించారు. సీతారామరాజు 1897 జూలై 4న అప్పటి విశాఖపట్నం జిల్లా పాండ్రంగి అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి వెంకట రామరాజు చక్కని ఫొటోగ్రాఫర్, చిత్రకారుడు. తల్లి సూర్య నారాయణమ్మ. ఆమెకు భారత, భాగవత, రామాయణాలు కంఠతావచ్చు.

తీరిక వేళల్లో ఆధ్యాత్మిక బోధనలు, రామాయణ కీర్తనలు పాడుతూ రామరాజుకి సాధు శీలత, ధర్మనిరతిలను అలవడేలా చేసింది. 1908లో కలరా వ్యాధి సోకి తండ్రి ఆకస్మికంగా మరణించడంతో రామరాజు మానసికంగా ఎంతో దెబ్బతిన్నాడు. బంధువుల ప్రోత్సాహం తో కోలుకొని తిరిగి చదువులో పడ్డాడు. కాకినాడలో 8వ తరగతి చదువుతున్నప్పుడు నాటకాల లో స్త్రీ పాత్రలను పోషించి ఎంతో రక్తి కట్టించాడు. మంచి నటుడుగా చిన్నతనంలోనే పేరు పొందాడు. పాఠశాలలో విద్యార్థి నాయకుడు. తోటి విద్యార్థులకు వ్యాయామవిద్యలో ఆసక్తి కలిగింప జేయడమేకాక మేజిక్ నేర్చుకుని, విరామ సమయాల్లో అద్భుత వినోదాన్ని పండించేవాడు. 

18వ ఏట దేశ పరిస్థితులను తెలుసుకోవాలనే తపనతో తీర్థయాత్రలు చేశాడు. ముందు హరిద్వార్ వెళ్ళాడు. అక్కడి నుండి అడవిమార్గాన నడక సాగిస్తూ రిషికేశ్, బద్రీనాథ్, కాశీ, ప్రయాగ, పూరి, బొంబాయి, కాశ్మీర్ ప్రాంతాలు సందర్శించి, అపార జ్ఞానం సంపాదించాడు. ఇంటికి వచ్చి భవిష్యత్తు కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు. అదే సమయంలో జిల్లాలోని కృష్ణదేవిపేట, జోగంపేట, మల్లంపేట, శరభన్నపాలెం, చిట్టెంపాడు ప్రాంతాల్లోని ప్రజలను బ్రిటిషు ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తూ కూలీ ఇవ్వకుండా దోపిడీ చేయడం గురించి విన్నాడు. ఆ గ్రామాలకు వెళ్లి ‘మీకు కూలి ఇవ్వనిదే చాకిరీ చేయకండి’ అని ప్రబోధించాడు. పరిస్థితులు బాగు పడక ఆందోళనకు దారితీశాయి. 1922 ఆగస్టులో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. దాంతో మద్రాసు ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కి పడింది. 

అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మరెన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేశాడు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మిరపకాయ టపాద్వారా తాను చేయబోయే దాడుల గురించి ముందుగానే సమాచారం అందించేవాడు. ఆ అద్భుత ధైర్యానికి బ్రిటిషు అధికారులకు కంటిమీద నిద్ర లేకుండా పోయింది. చివరకు కుటిల యత్నంతో రామరాజు ఆచూకీ చెప్పాలని మన్యం ప్రజలను హింసించారు. అనేకమందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. దీనిని భరించలేక రామరాజు తనకు తానే 1924 మే 7న వారికి పట్టుబడ్డాడు. మేజర్ గుడాల్ అనే అధికారి రామరాజును చెట్టుకు కట్టి దారుణంగా కాల్చి చంపాడు. అల్లూరి పోరాట స్ఫూర్తి తెలుగువారికేకాక యావత్ భారతీయులకే గర్వకారణం.

 కామిడి సతీష్ రెడ్డి