calender_icon.png 27 October, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డపై సమీక్ష

22-07-2024 01:19:59 AM

హస్తిన చేరిన సీఎం రేవంత్ 

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌తో చర్చలు

నేటి ఎన్‌డీఎస్‌ఏ సమావేశంపై సమాలోచనలు 

వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ 

రాహుల్‌ను ఆహ్వానించనున్న సీఎం

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం హస్తినకు వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశా లపై ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలో శనివారం జరిగిన డ్యామ్‌సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంకు వివరించారు.

సోమవారం మరోసారి ఎన్‌డీఎస్‌ఏ సమావేశం జరగనుండటంతో.. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి అంశాలను సమావేశం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. సీఎంతో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా , నీటిపారుదల శాఖ సలహాదారు ఆధిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. 

వరంగల్ రైతు కృతజ్ఞత సభకు రాహుల్‌కు ఆహ్వానం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఇప్పుడు  ప్రభుత్వం రుణమాఫీని రూ.లక్ష వరకు అమలు చేయడంతోపాటు త్వరలో పూర్తిగా మాఫీ చేయనుండటంతో వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని సీఎం భావించారు.

ఈ సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రాహుల్ అపాయింట్‌మెంట్ లభించగానే వరంగల్ సభ తేదీని ఫిక్స్ చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరితో కలిసి సీఎం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాహుల్‌గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి వరంగల్‌లో కృతజ్ఞత సభ తేదీని ఖరారు చేయనున్నారు.