బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఎంసిపిఐ నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసులేటి వెంకటేశ్ లు వినతి పత్రం అందజేశారు. 1998లో బెల్లంపల్లిలో మంజూరైన మెడికల్ కళాశాల, కొంతమంది నాయకుల, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. రూ.62 కోట్లతో 75% పనులు పూర్తయినప్పటికీ అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల నిధులు నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. జాతీయ వైద్య కమిషన్ దేశవ్యాప్తంగా 72 మెడికల్ కళాశాలలను ప్రస్తావించిందని, ఇందులో తెలంగాణకు 8 కళాశాలు మంజూరయ్యాయని, ఈ కళాశాలల జాబితాలో బెల్లంపల్లి పేరును ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వారు ఎమ్మెల్యే వినోద్ ను వినతి పత్రంలో కోరారు.