calender_icon.png 28 September, 2024 | 4:45 PM

15 రోజులకోసారి నివేదిక ఇవ్వాలి

27-09-2024 12:30:36 AM

గురుకులాలు, బీసీ హాస్టళ్లను మెరుగుపర్చేందుకు చర్యలు

సిలబస్‌తోపాటు ప్రాక్టికల్స్, గేమ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ

సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బీసీ గురుకులాల్లో విద్యా ప్రమాణా లను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతీ 15 రోజులకోసారి సమీక్షించి నివేదిక రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్య, విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్య లపై గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ... హాస్టళ్లలో నాణ్యమైన ఆహా రం అందించాలని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు.  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకా రంతో రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో సక్రమంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో పలు కంపెనీలు సీఎస్‌ఆర్ ఫండ్స్ కింద ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్ర మాలు చేపట్టారని, గురుకులాల్లోని విద్యార్థులకూ వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి వారి సహకారం తీసుకొని మెరుగైన శిక్షణ అందించాలని ఆదేశించారు.  సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకులాల సెక్రటరీ సైదులు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్, జాయింట్ డైరెక్టర్ సంధ్య, కార్పొరేషన్ ఎండీలు చంద్ర శేఖర్, ఇందిరా, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

బాపూజీ కృషి మరువలేనిది: పొన్నం

బడుగు, బలహీన వర్గాల చైతన్యం, ఆత్మగౌరవానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలు, సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించుకుంటూ నివాళి అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఆయన పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని, జీవితాంతం తెలంగాణ సాధన కోసమే ఉద్యమించారని గుర్తుచేసుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి నట్లు తెలిపారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకొని గౌరవించుకున్నామన్నారు.