calender_icon.png 31 October, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకు ఊరట

02-08-2024 01:35:46 AM

ఎస్బీఐ ప్రొసీడింగ్స్ అమలు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): ఇంద్‌భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్‌భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రాజు బ్యాంకు అకౌంట్‌ను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్బీఐ ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకు ఖాతాను మోసపూరితంగా ప్రకటిస్తూ ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రాజు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ పూసర్ల వాదనలు వినిపిస్తూ ఇంద్ భారత్ పవర్ కంపెనీలో పార్టెం, నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరుగా ఉన్నారని అన్నారు.

మోసపూరిత ఖాతాగా ప్రకటించడానికి ముందు గత ఏడాదిలో ఎస్బీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతోపాటు అన్ని పత్రాలను సమర్పించాలని రఘురామ కష్ణరాజు రెండుసార్లు వినతి పత్రాలు సమర్పించారని చెప్పారు. అయితే ఎస్బీఐ ఎంపిక చేసుకున్న కొన్ని పత్రాలను మినహా పూర్తి నివేదికను అందజేయలేదని అన్నారు. మోసపూరిత ఖాతాగా ప్రకటించిన ఎస్బీఐ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు.

వాదనలను విన్న న్యాయమూర్తి ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ప్రతివాదులైన రిజర్వు బ్యాంకు, ఎస్బీఐకి నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు. మరో పిటిషన్‌లో ఇంద్ భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ డైరెక్టర్ కె సీతారామం ఖాతాను మోసపూరితగా ఖాతాగా ప్రకటిస్తూ మే 28న జారీచేసిన ప్రొసీడింగ్‌లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తరులు జారీచేశారు.