హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై బోరబండలో నమోదైన కేసులో శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. తతుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు గోపీనాథ్‌ను అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గోపీనాథ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బోరబండ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మే 9న బోరబండ ఏరియాలో 200 బైక్‌లతో అనుమతి లేకుండా ర్యాలీ తీశారని ఒక కేసు, ఒక మతానికి చెందిన వారు ప్రార్థనలు చేస్తుండగా ర్యాలీ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగిందని రెండో కేసు నమోదైంది. వీటిని కొట్టేయాలని కోరుతూ గోపీనాథ్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. కేసుల నమోదు తీరును పరిశీలించిన న్యాయమూర్తి, ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని పోలీసులకు మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. పోలీసుల దర్యాప్తునకు పిటిషనర్ సహకరించాలని షరతు విధించారు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.