ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
యాదాద్రి భువనగిరి, జనవరి 22 ( విజయక్రాంతి ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, కాంగ్రెస్ పార్టీ పెడుతున్న గ్రామసభలు తీవ్ర గందరగోళంగా మారాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కవిత గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమా కవిత మాట్లాడుతూ.. యదగిరిగుట్ట దేవస్థానాన్ని కేసీఆర్ మహాద్భుతంగా అభివృద్ధి చేశారని, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ఉమ్మడి నల్లగొండ అంటేనే చైతన్యానికి మారు పేరని, కేసీఆర్ నాయకత్వంలో నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాధనం లూటీ చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ 61 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ అని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేరని చెప్పారు. ఆదా పెంచి పేదలకు పంచేలా బీఆర్‌ఎస్ పాలన సాగిందన్నారు. కాంగ్రెస్ పెడుతున్న గ్రామ సభలు గందరగోళంగా మారాయని, తమకు పథకాలు రాలేదంటూ పజలు ఆగ్రహంగా ఉన్నారని కవిత అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.