అబ్దుల్లాపూర్‌మెట్ పిగ్లీపూర్‌లో రైతులపై భౌతికదాడి
సీలింగ్ ల్యాండ్‌లో వెంచర్ వేశారని ఆరోపణలు
స్థానిక పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 24: అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఓ భూవివాదం భౌతిక దాడులకు దారి తీసింది. వివరాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్‌లో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని వెంచర్ చేశారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళిత రైతులు మంగళవారం వెంచర్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో వెంచర్ నిర్వాహకుడు తన ప్రైవేట్ ముఠాతో కర్రలు, రాళ్లతో రైతులపై దాడి చేయించాడు. ఈ మేరకు బాధితులు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితులు మాట్లాడుతూ.. పిగ్లీపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 17 సర్వే నంబర్‌లో ప్రభుత్వ రికార్టల ప్రకారం 386 ఎకరాల భూమి ఉంది.
ఇందులో 75 ఎకరాలు భూదాన్ యజ్ఞబోర్డ్ భూమి ఉండగా... 61 ఎకరాల ప్రభుత్వ భూమి, 53 ఎకరాల సీలింగ్ భూమి... 197 ఎకరాల పట్టా భూమి ఉంది. కాగా సీలింగ్ భూమిలో 16 మంది రైతులకు 45 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని తమ తాతలు, తండ్రుల నుంచి తాము సాగులో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
ఇదే 17 సర్వే నెంబర్‌లోని 26 ఎకరాల ప్రైవేట్ భూమిలో మెరుగు గోపాల్ యాదవ్ అనే ఓ రియల్టర్ వెంచర్ వేశాడు. అయితే అతడి వెంచర్‌లో తమ సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నాడని.. కొన్నిరోజులుగా పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది దళితులమే ఉన్నామని.. తమగోడు ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఈరోజు తమపై వెంచర్ నిర్వాహకుడి మనుషులు తమపై దాడిచేశారని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కావాలనే రైతులు రెచ్చగొడుతుండ్రు
మా వెంచర్‌కు సంబంధించిన భూములు పక్కాగా పట్టావి. భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పటివరకు ముగ్గురు పేర్లపై రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. రెండు సంవత్సరాల నుంచి మేము వెంచర్ చేస్తున్నాం. అందులో ప్లాట్లు కూడా దాదాపు అమ్ముడుపోయాయి.
పిగ్లీపూర్‌కు చెందిన రైతులు ఇప్పుడు వచ్చి ఆ భూములు మావి అని చెబుతున్నారు. రెండేళ్లనుంచి ఏంచేశారు. రైతులను కావాలనే కొందరు వ్యక్తులు రెచ్చగొడుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతితోనే వెంచర్ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నాం. గ్రామస్తుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.
గోపాల్ యాదవ్, వెంచర్ నిర్వాహకుడు