01-04-2025 05:05:51 PM
జుక్కల్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్...
జుక్కల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పేదలకు పెద్ద పండుగ అని జుక్కల్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ అన్నారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని బంగారుపల్లి గ్రామంలో సన్నబియ్యం రేషన్ కార్డు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 15 నెలలొనే ఆచరణలో చేసి చూపిస్తోందన్నారు.
ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్ ఒకటో తారీకు నుండి సన్న బియ్యం పంపిణీ చేపడుతుండంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 2858 కోట్లు అదనపు భారం పడుతుందని, ఎంత భారం అయినా ప్రజలకోసమే ఈ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అందించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలని ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష, అదే ఇందిరమ్మ రాజ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంగారుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ పటేల్, దేవిదాస్, మారుతీ పటేల్, రఘు పటేల్, మారుతి రెడ్డి, అర్జున్, గంగారాం, శభాష్, సురేష్ ప్రసాద్, జైపాల్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.