06-02-2025 05:12:29 PM
కట్లపాము ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో ఘటన..
షరా "మామూలు"గా తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కల్తీ కల్లు సీసాలో ఎలుక దర్శనమిచ్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం తన ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ కార్యక్రమానికి ఆనవాయితీగా గ్రామంలోని నాగరాజుగౌడ్ అనే వ్యక్తి కల్లు దుకాణంలో కల్లు పెట్టెలను కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన బంధువులకు కుటుంబ సభ్యులకు ఆ కల్లు సీసలను సరఫరా చేసాడు. ఈ క్రమంలో ఓ మహిళ కల్లు సీసా ఎత్తి తాగుతుండగా ఏదో కదులుతున్నట్లు గుర్తించి సీసా ఒలికించడంతో అందులోనుండి మరణించిన ఎలుక బయటపడుతూ కనిపించింది.
దీంతో ఒక్కసారిగా ఆందోళన గురై కల్తీకల్లు తయారు చేసిన యజమాని దృష్టికి తీసుకు వెళ్తే నిర్లక్ష్యం సమాధానం ఇచ్చాడు. దీంతో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సైతం బెదిరింపు ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఆ గ్రామంలో అపరిశుభ్ర వాతావరణంలోని కల్తీకల్లు తయారీ జరుగుతుందని తాగిన సీసాలను కూడా కడగడం లేదని బాధితులు ఆరోపించారు. ఇలాంటి ఘటన గత వారం క్రితమే బిజినపల్లి మండలం లట్టుపల్లి తండాలో కల్తీకల్లు సీసాలో కట్లపాము దర్శనమిచ్చిన ఘటన తెలిసిందే.