సిద్దిపేట, జూలై 3 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని అతిపురాతనమైన గ్రామం రాయపోల్‌లో తెలంగాణ చరిత్రకారులు అరుదైన సిడితల వీరుగల్లు విగ్రహాన్ని గుర్తించారు. రాయపోల్‌లోని గణపతి దేవాలయం దగ్గర కొన్ని భిన్నమైన వీరుగల్లు విగ్రహాలు ఉన్నాయి. వాటిలో చాళుక్య రాష్ట్ర కూటుల కాలానికి చెందిన శిల్పాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన వీరుగల్లు శిల్పం ఉంది. ఈ శిల్పం ఆత్మహుతి వీరుగల్లుగా, ఇలాంటి శిల్పాన్ని సిడితల వీరుగల్లుగా కూడా పిలుస్తారు. ఇది రెండంతస్తులు ఉండగా మొదటి అంతస్తులో ఒక వీరుడు కూర్చుని ఉంటాడు. ఇటువంటి శిల్పాన్ని సిడితల వీరుగల్లు అంటారు.
ఇలాంటి సిడితల వీరుగల్లులు తెలంగాణలో పదిలోపుగానే లభించాయి. శైవభక్తులు ఆత్మబలిదానాలను ధర్మకార్యంగా, శివుడి సన్నిధికి చేర్చే తక్షణ మార్గంగా ఎంచుకున్నారు. అందుకే ఈ ఆత్మాహుతులు జరిగాయి. ఈ మధ్య వచ్చిన యుగానికి ఒక్కడు సినిమాలో కూడా ఇలాంటి శిల్పాన్ని పోలిన దృశ్యం ఉంది. అందులో చోళులు తిరిగి చోళనాడుకు వెళ్లే సందర్భంలో ఎవరైనా బలిదానం చేయాలి అన్నపుడు ఒక వ్యక్త తన తల వెంట్రుకలను వెదురు గడకు కట్టి కత్తితో ఇలానే నరుక్కుని బలిదానం చేస్తాడు. ఇలాంటి వీరుగల్లుల ఆధారంగా అనేక సినిమాలు కూడా వచ్చినట్లు చరిత్ర గుర్తింపుకారులు అంటున్నారు.