calender_icon.png 25 October, 2024 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్‌లో భారతీయ నటికి అరుదైన గౌరవం

28-05-2024 12:05:00 AM

ఈ మధ్య భారతీయ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. దీనికి తార్కాణంగా ఫ్రాన్స్‌లో ఈ నెల మే 14 నుంచి 25 వరకు జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 77వ ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. బల్గేరియన్ చిత్ర నిర్మాత కాన్‌స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన ‘ది షేమ్‌లెస్’ లెస్బియన్ చిత్రానికి గాను ఆమెకు ఈ అవార్డు వరించింది. ఈ చిత్రంలో అనసూయ ఒక సెక్స్ వర్కర్‌గా నటించింది.

గే కమ్యూనిటీకి అంకితం

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనసూయ సేన్‌గుప్తా అన్ సెర్టున్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా గుప్తా నిలిచిపోయింది. అయితే తన అవార్డును గే కమ్యూనిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాల ధైర్యసాహసాలకు అంకితం చేసింది. అవార్డు తీసుకున్న తర్వాత ఆమె ప్రసంగంలో ‘సమానత్వం కోసం పోరాడేందుకు స్వలింగ సంపర్కులే కానవసరం లేదు. మంచి మనసున్న మనుషులుగా ఉంటే సరిపోతుంది’ అని తెలిపింది.

చిత్రం గురించి

బల్గేరియన్ డైరెక్టర్ కాన్ స్టాంటిన్ బొజనోవ్ ‘ది షేమ్‌లెస్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన అనసూయ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి, అవార్డును తన ఖాతాలో వేసుకుంది. అయితే చిత్రంలో ఆమె రేణుక అనే వేశ్య పాత్రలో నటించింది.  రేణుక ఢిల్లీలో ఓ బ్రోతల్ హౌజ్‌లో పోలీస్‌ని చంపి పారిపోతుంది. అక్కడ నుంచి ఆమె సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడే 17 ఏళ్ల దేవికతో ప్రేమలో పడుతుంది. తర్వాత వీరిద్దరూ తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నదే ఈ చిత్రం కథా నేపథ్యం. అయితే భారత్, నేపాల్‌లో నెలన్నర రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ఎంపికై ప్రదర్శించబడింది.

అలా మొదలైంది

పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకి చెందిన అనుసూయ ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. తర్వాత అవకాశం రావడంతో నటిగా మారింది. బొజనోవ్ ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్... అలా పరిచయమైన బొజనోవ్ ఒక సారి ఆడిషన్ టేప్ పంపమని అనసూయకు అడిగారు. ఆడిషన్ టేప్ నచ్చడంతో సినిమాలో అనసూయకు ఛాన్స్ దక్కించుకుంది. నటిగా ఆమె తొలి ప్రయత్నంలోనే కేన్స్‌లో అవార్డు దక్కించుకుంది.