జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీజేశ్ ధరించిన జెర్సీ నంబర్ 16కు హాకీ ఇండియా వీడ్కోలు పలికింది. జెర్సీ నంబర్ 16 హాకీ ఇండియాలో శాశ్వతంగా ఉండిపోతుందని.. వేరెవరికి ఈ నంబర్ కేటాయించమని తెలిపింది. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన అనంతరం పీఆర్ శ్రీజేశ్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా రిటైర్మెంట్ అనంతరం శ్రీజేశ్‌ను హాకీ ఇండియా జూనియర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించింది.
ఈ సందర్భంగా బుధవారం హాకీ ఇండియా శ్రీజేశ్ జెర్సీకి శాశ్వత స్థానం కల్పిస్తూ నంబర్ 16కు వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా జెర్సీ నంబర్ 16 ధరించి శ్రీజేశ్‌కు ప్రత్యేక గౌరవం కల్పించారు. ‘శ్రీజేశ్ ఇప్పుడు జూనియర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అందుకే అతడి జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇది శ్రీజేశ్‌కు మేమిచ్చే గౌరవం. జూనియర్ జట్టులో నంబర్ 16 జెర్సీ మాత్రం అలానే ఉంటుంది’ అని హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్ సింగ్ వెల్లడించారు.