అత్యున్నత పురస్కారం అందించిన గయానా, డొమినికా
జార్జిటౌన్/ సాంటో డొమింగో, నవంబర్ 21: భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. కరేబియన్ దేశాలైన గయానా, డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని గౌరవించాయి. ప్రపంచ దేశాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు గాను భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం‘ ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను గయానా దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ గురువారం అందించారు.
ఈ పురస్కారాన్ని పొందిన విదేశీ వ్యక్తుల్లో మోదీ నాలుగోవారు. అంతకుముందు తమ దేశ అత్యున్నత పురస్కారం‘ డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ను ప్రధాని మోదీకి కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా దేశ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ అందజేశారు.
కరోనా సమయంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలోని భారత్ అందించిన సహకారం, అందులో మోదీ పాత్రను బర్టన్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ అవార్డులను భారత సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నట్లు ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మరోవైపు జార్జిటౌన్‌లో డొమినికా ప్రధాని రూజ్‌వే స్కెర్రిట్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు.