calender_icon.png 26 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన గౌరవం

01-07-2024 12:00:00 AM

జ్వరం.. పంటి నొప్పి.. నడుము నొప్పి.. ఛాతిలో పట్టినట్టు అనిపించినా.. ఇలా చిన్న చిన్న సమస్యలకు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం కామన్. డాక్టర్ మన గుండె మీద స్టెత్ పెట్టినప్పుడు.. మందు చీటి రాసినప్పుడు.. ఇంజెక్షన్ వేసినప్పుడు.. ఎక్స్‌రే కోసం చేయెత్తి చూసినప్పుడు.. ఆపరేషన్ బల్ల మీద ‘మరేం పర్వాలేదు’ అన్నప్పుడు.. డిశ్చార్జ్ అవుతుండగా ‘జాగ్రత్తగా ఉండు’ అని హితవుచెప్పినప్పుడు.. పెద్దలు ‘వైద్యో నానరాయణో హరి’ అని ఎందుకన్నారో అర్థమవుతుంది. దేవుడు కరుణ మాత్రమే చూపుతాడు. కానీ.. మనకు కళ్లకు కనిపించే దేవుళ్లు డాక్టర్లు. కరోనా కాలంలో మనుషుల కోసం ప్రాణాలు అర్పించిన డాక్టర్లను తలచుకుంటూ ప్రాణం పోస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్యూ డాక్టర్ అని చెప్పుకుందామా..

“మందులు వ్యాధులను నయం చేస్తాయి కానీ వైద్యులు మాత్రమే రోగులను నయం చేయగలరు” ఇన్ని సేవలను అందిస్తున్న వీరిని స్మరించుకోవడం కచ్చితంగా అవసరం. జూలై 1న అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం. అయితే ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

డాక్టర్స్ డే మొదటగా 1991న నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్ర రాయ్‌కు గౌరవం ఇవ్వడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై 1న జరుపుకుంటారు. ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవం. మహాత్మా గాంధీ సూచన మేరకు బెంగాల్‌లో ఉన్న పరిస్థితులను బట్టి 1948 నుంచి 1962 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందారు. దేశ చరిత్రలో ఒక సాధారణ వైద్యుడు మేయర్‌గా, శాసనసభ సభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక వ్యక్తి బీసీ రాయ్ అని చెప్పవచ్చు.

వైద్య వృత్తి మాత్రమే కాకుండా ప్రజా సేవకు అంకితమైన తమ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రకటించింది. రాయ్ జ్ఞాపక శక్తిని శాశ్వతం చేయడానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1962లో నేషనల్ అవార్డు ఫండ్‌ను స్థాపించింది. మెడికల్ రంగంలో వివిధ శాఖలలో ప్రతిభ కనపరిచిన వారికి బి.సి.రాయ్ పేరు మీద 1976లో నేషనల్ అవార్డు ప్రకటించారు. బి.సి.రాయ్‌ను భారత ప్రభుత్వం 1961 ఫిబ్రవరి 4న భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న బిరుదుతో సత్కరించింది.

దేశ వ్యాప్తంగా ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, వర్క్ షాపులు, రోగులకు పండ్లు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వైద్య సేవలకు గుర్తుగా రోగులు కూడా వైద్యులకు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు. డాక్టర్ బి.సి.రాయ్ మరణించేంత వరకు ప్రజా సేవలో ఉంటూ 1962 జూలై 1న పరమపదించారు. ఆయన పుట్టినరోజు, వర్థంతి ఒక్కటే రోజున జరుపుకోవడం యాదృచ్ఛికం.