13-04-2025 01:25:27 AM
కాలగమనంలో ఎన్నో కళారూపాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జానపద కళారూపాలు ఒక్కొక్కటి మరుగున పడుతున్నాయి. ఆధునిక మోజులో పడి వాటిని ఆదరించకపోవడమే అందుకు కారణం. అలా మరుగునపడిన అరుదైన జానపద కళారూపాలకు ప్రాణం పోస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ కళాకారుడు.
వీడియో గేమ్స్, ఆన్‌లైన్ ఆటలు ఈతరం పిల్లలకు వ్యాపకంగా మారాయి. నిత్యం అందులోనే మునిగి తేలే చిన్నారులను చూస్తుంటాం. కాని, కళల పట్ల ఆసక్తి చూపే చిన్నారులు సైతం లేకపోలేదు. ఆదిలాబాద్‌కు చెందిన కళాకారుడు నిశికాంత్ దేశ్‌పాండే తనలో దాగి ఉన్న కళలను ఈతరం పిల్లలకు నేర్పిస్తున్నాడు.
‘మంథనం ఒక సంకల్పం’ అనే వేదికగా ద్వారా జడ కొప్పు కోలాటం కళకు పునర్జీవనం పోస్తున్నాడు. ఇక్కడి పిల్లలకు జానపద కళల పట్ల ఆసక్తి కలుగుతోంది. వారిలో కలిగిన ఆసక్తిని ఆట రూపంలో మలిచేలా ఈ కళను పరిచయం చేశాడు. ప్రస్తుతం పిల్లలు మెళకువలను తెలుసుకొని, అవలీలగా కళను ప్రదరిస్తున్నారు. తమ ప్రతిభతో పలువురిని మెప్పిస్తున్నారు.
రాణిస్తున్న చిన్నారులు
కేవలం రెండు నెలల్లోనే పిల్లలు శిక్షణ పొందారు. జడకొప్పును పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తున్నారు. కోలాటం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఏకరూప దుస్తుల్లో లయబద్దంగా ప్రదర్శనలు చేస్తూ చూపరులను మైమరిచిపోయేలా చేస్తున్నారు.
జడకొప్పు అంటే..
ఇదొక సంప్రదాయ గ్రామీణ కళారూపం. వ్యవసాయ పనులతో అలసిపోయిన రైతులు, గ్రామీణులు పల్లెల్లో ఆటవిడుపుగా ఈ కళను ప్రదరిస్తూ సాంతన పొందుతుంటారు. ఎంతో నిష్టతో, ఏకాగ్రతతో ప్రదరించే కళ ఇది. అదే జడకొప్పు కోలాటం. ఒకచేతితో కోల పట్టుకొని, మరోచేతితో చీర అంచును పట్టుకొని జానపద పాటలకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తూ, కోలలు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ జడ అల్లడం.
ఆ తరాత అల్లిన జడలు విప్పడం ఈ ఆట ప్రత్యేకత. ఈ జడకొప్పులో ‘ఓనామా జడ, తడక జడ, కృష్ణ జడ, లక్ష్మీ జడ, మంగళ హారతి జడ’ ఇలా అనేక రకాల జడలు ఉంటాయి. గ్రామ మధ్య లోని కూడలిలో ఎత్తయిన కర్రలను పాతి, వాటి మధ్యలో చీరెలను కట్టి వాటిని ఓ చేత్తో పట్టుకుని, జానపద పాటలు పాడుతూ చీరలను అల్లడం, మళ్లీ ఓ క్రమపద్ధతిలో విప్పడమే ఈ జడకొప్పు అంటారు.
ఏకాగ్రత పెరుగుతుంది
పురాతన ఆటాపాటలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నాలాంటివారితో కలిసి గ్రూపును ఏర్పాటు చేశా. ప్రాచీన కళలు, పెయింటింగ్, జానపద నృత్యాలు ఇలాంటి వాటిపై చిన్నారులకు శిక్షణను అందిస్తున్నా. పిల్లలు ఈ ఆటను నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించగలుగుతారు.
నిశికాంత్ దేశ్‌పాండే, కళాకారుడు