- సెన్సెక్స్ 80,000 పాయింట్ల పైన ముగింపు
ముంబై, జూలై 4: స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర గురువారం సైతం యథావిధిగా కొనసాగింది. క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలిసారిగా 80,000 పాయింట్ల స్థాయిని దాటి చరిత్ర సృష్టించినప్పటికీ, ఆపైన ముగియలేకపోయింది. తాజాగా ఆ లక్ష్యాన్ని పూర్తిచేసింది. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 80,392 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ట్రేడింగ్ ముగింపు సమయంలో కొంతమేర లాభాల స్వీకరణ జరగడంతో చివరకు 63 పాయింట్ల లాభంతో 80,049 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రప్రధమంగా 24,400 పాయింట్ల స్థాయిని అధిగమించి నూతన రికార్డు సృష్టించింది. చివరకు 16 పాయింట్ల లాభంతో 24,302 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌లో 23 షేర్లు లాభపడగా, 27 షేర్లు నష్టాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్, సియోల్‌లు పాజిటివ్‌గా ముగిసాయి. షాంఘై మార్కెట్ తగ్గింది. ప్రధాన యూరప్ మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు లాభపడ్డాయి.
టాప్‌లో టాటా మోటార్స్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్ షేరు 2.75 శాతం పెరిగి పలు రోజుల అనంతరం రూ. 1,000పైన ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.7 శాతం జంప్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు 1. శాతం మధ్య పెరిగాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికంగా 2.5 శాతం మేర నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు 1 శాతం మధ్య క్షీణించాయి.
వివిధ రంగాల సూచీల్లో జోరుగా హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.17 శాతం పెరిగింది. ఐటీ ఇండెక్స్ 1.12 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.98 శాతం, ఆటోమొబైల్ సూచి 0.88 శాతం, టెలికమ్యూనికేషన్స్ 0.73 శాతం చొప్పున ఎగిసాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.22 శాతం తగ్గగా, ఎఫ్‌ఎంసీజీ 0.15 శాతం, ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.02 శాతం మేర తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.60 శాతం లాభపడింది. బీఎస్‌ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,185 షేర్లు లాభాలతో ముగియగా, 1,742 షేర్లు క్షీణించాయి.
కొత్త రికార్డుస్థాయికి మార్కెట్ విలువ
నాన్ ర్యాలీతో గురువారం స్టాక్ మార్కెట్ విలువ నూతన రికార్డుస్థాయి రూ.447.40లక్షల కోట్ల వద్దకు చేరింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,47,30,453 కోట్లకు (5.36 ట్రిలియన్ డాలర్లు) పెరిగింది.
ఐటీ షేర్ల నేతృత్వంలో..
తాజా మార్కెట్ ర్యాలీకి సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఐటీ షేర్లు నేతృత్వం వహించాయి. పలు బ్యాంకింగ్ షేర్లు నష్టపోయినప్పటికీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు జోరు చూపించాయి. యూఎస్‌లో ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గడం, యూఎస్ పదేండ్ల బాండ్ ఈల్డ్ గణనీయంగా తగ్గడం, జూన్ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రదర్శిస్తాయన్న అంచనాలతో ఐటీ, ఫార్మా రంగాల్లోని లార్జ్‌క్యాప్ షేర్లు ర్యాలీ జరిపినట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సెప్టెంబర్‌లో ఫెడ్ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్నందున సెంటిమెంట్ మెరుగు పడిందన్నారు. బుధవారం రూ. 5,483 కోట్లు పెట్టుబడి చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తాజాగా మరో
రూ. 2,575 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిఫ్టీ 24,500 పాయింట్ల లక్ష్యాన్ని సమీపిస్తున్నందున, కొంతమేర లాభాలను తీసుకుని, తిరిగి లాంగ్ పొజిషన్లు తీసుకునేందుకు వేచిచూడటం శ్రేయస్కరమని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా సూచించారు.