calender_icon.png 21 November, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడలు విప్పుతున్న ర్యాగింగ్ భూతం!

21-11-2024 12:32:03 AM

  1. మెడికల్ కాలేజీల్లో పెరుగుతున్న ర్యాగింగ్ కల్చర్ 
  2. కొత్తగా చేరిన విద్యార్థులకు తప్పని వేధింపులు 
  3. ఫలితమివ్వని ర్యాగింగ్ నియంత్రణ చట్టాలు 
  4. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
  5. ప్రభుత్వ ఆదేశాలతోనైనా ర్యాగింగ్ ఆగేనా

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): ఇటీవల గుజరాత్‌లోని ఓ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతానికి అనిల్ మెథానియా అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. 3 గంటల పాటు సీనియర్లు చేసిన ర్యాగింగ్‌తో విద్యార్థి చనిపోయినట్టు తెలుస్తోంది. పరిచయం పేరిట చేసిన ర్యాగింగ్ తోనే అనిల్ ప్రాణాలు కోల్పయినట్టు చెప్తున్నారు.

గుజరాత్‌లో వైద్య విద్యార్థి మృతి ఘటన కలకలం రేపుతుంటే రాష్ట్రంలోనూ ర్యాగింగ్ ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. కష్టపడి మెడికల్ సీటు సాధించి, బంగారు కలలతో కళాశాలలో అడుగుపెడుతున్న విద్యార్థుల ఆశలపై ర్యా గింగ్ భూతం నీళ్లు గుమ్మరిస్తున్నది.

ఎంతో కష్టమైన నీట్‌లో అర్హత సాధించి డాక్టర్లు అవుదామని ఆశపడుతున్న విద్యార్థులు ర్యాగింగ్ భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనే ఈ ర్యాగింగ్ భూతం ఎక్కువగా ఉంటోంది. 

యాంటీ ర్యాగింగ్ కమిటీ అధికారే ర్యాగింగ్ చేస్తే 

* ర్యాగింగ్ నుంచి విద్యార్థులను కాపాడేందుకు అక్కడి ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగిం గ్ కమిటీ ఇన్‌చార్జి అయిన ప్రొఫెసరే అక్కడ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థినిని కాపాడాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్‌చార్జినే గుండు కొట్టించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి హెయిర్ స్టుల్‌ను కూడా జీర్ణించుకోలేక సదరు ఫ్రొఫెసర్ గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. 

* పాలమూరులో విద్యార్థితో గోడ కుర్చీ వేయించి దారుణంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలపై యాజమాన్యం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోందనే ఆరోపణలున్నాయి. వీటిపై కనీసం వైద్యవిద్యా శాఖ అధికారులకు కూడా సమాచారం వెళ్లకుండా చూస్తున్నారని తెలుస్తోంది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలున్నా అవి ఉత్తుత్తివే అయిపోయాయి. 

* నల్లగొండ మెడికల్ కళాశాలలో కేరళకు చెందిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బాధిత విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఓ జూనియర్ డాక్టర్, ముగ్గురు వైద్య విద్యార్థులు మద్యం మత్తులో ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించి నివేదిక అందించగా, సెకండియర్ విద్యార్థిని నెల రోజులు, నాలుగో సంవత్సరం విద్యార్థి, జూనియర్ డాక్టర్‌కు 3 నెలల సస్పెన్షన్ విధించారు. 

ర్యాగింగ్‌ను ఎదుర్కొనేందుకు 

* విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల తలెత్తే పరిణామాలపై అవగాహన కల్పించాలి. 

* అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్కాడ్‌ను ఏర్పాటు చేయాలి.

* ర్యాగింగ్ ఘటనల్లో ఆత్మహత్యలకు పాల్పడితే సంబంధిత అధికారులను నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ విచారణకు హాజరవ్వాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి

* సీనియర్లు, జూనియర్ల మధ్య అంతరాలు లేకుండా చూసేందుకు మానటరింగ్ కమిటీలు పనిచేయాలి

* లీగల్ కౌన్సిలింగ్ ద్వారా ర్యాగింగ్ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి

* ర్యాగింగ్‌పై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్ 18001805522కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 

* సినిమా, సోషల్ మీడియా ప్రభావం యువతపై పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆయా మాధ్యమాల్లో ర్యాగింగ్ చేయడం కనిపించకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. 

వికృత చేష్టలు

విద్యతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మారుతున్న కాలంలో వికృత చేష్టలకు అడ్రస్ అవుతున్నారు. కొత్తగా కళాశాలలో చేరిన జూనియ ర్లతో స్నేహాన్ని బలపర్చుకునే విధానాన్ని వీడి సాటి విద్యార్థి మానసికంగా కృంగిపోయే విధంగా హింసకు ప్రేరేపిస్తున్నారు. దీనికి ర్యాగింగ్ అనే పేరు పెట్టి సాటి విద్యార్థులను చావు దాకా తీసుకువెళ్తున్న ఘటన లు తరచూ వెలుగుచూస్తున్నాయి.

అత్యుత్తమ విద్యగా చెప్పుకొనే మెడికల్, ఇంజినీ రింగ్ కళాశాలల్లోనే ర్యాగింగ్ ఎక్కువగా జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు, యూజీసీ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధం. అయినా, కొందరు సీనియర్లు జూనియర్ల పట్ల నిర్దయగా ప్రవర్తిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు.

పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెడికల్ కళాశాలల్లో ఇటీవల చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సీనియర్లు ర్యాగింగ్ పేరిట చేస్తున్న వికృత చేష్టలతో జూనియర్లు బెంబేలెత్తుతున్నారు. అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.

ర్యాగి ంగ్ చేస్తున్న వారిని కళాశాల నుంచి తొలగించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై చర్యలతో సరిపెట్టాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగిం గ్ ఘటనల్లో అధికారుల తీరు సక్రమంగా లేదని సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. 

ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించిన నేపథ్యంలోనే అధి కారులు ఆగమేఘాల మీద స్పందించి బాధ్యులపై చర్యలకు ఉపక్రమించారు.

ర్యాగింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ర్యాగింగ్‌ను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో అన్ని విద్యాసంస్థల్లోనూ ర్యాగింగ్ కామన్‌గా కనిపించేది. కానీ, క్రమంగా మిగతా కాలేజీల్లో తగ్గిపోయినా మెడికల్ కాలేజీల్లో మాత్రం కొనసాగుతూనే ఉంది. సీనియర్లు జూనియర్లను వేధిస్తూ వారు మానసిక స్థుర్యైం కోల్పోయేలా చేస్తున్నారు. ఈ ర్యాగింగ్‌కు కొంత మంది అధ్యాపకులు కూడా సహకరించడం దారు ణం.

ఇందుకు ఖమ్మం మెడికల్ కళాశాల ఘటనే ఉదాహరణ. ముందు అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటే ర్యాగింగ్ ఘటనలు పునరా వృ తం కావు. ర్యాగింగ్ చేస్తే కళాశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తారనే భయం ఉంటే ఎవరూ ర్యాగింగ్ చేయరు. ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలి. 

 హరీశ్ గౌడ్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు