- భారత్-చైనా సరిహద్దుల్లో బంగారం స్మగ్లింగ్
లద్దాఖ్‌లో 108 కిలోల బంగారం పట్టివేత
ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు
ఐటీబీపీ బలగాలకు చిక్కిన ముగ్గురు నిందితులు
శ్రీనగర్, జూలై 10: గోల్డ్ స్మగ్లర్లు బంగారాన్ని ఖండాంతరాలు దాటించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నా రు. తక్కువ జన సాంద్రత ఉండే దేశాల సరిహద్దులను సైతం ఎంచుకుంటున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో స్మగ్లర్లు ఏకంగా క్వింటా బంగారాన్ని రవాణా చేస్తూ భద్రతా బలగాలకు పట్టుబడ్డారు. స్మగ్లర్లు సాధారణంగా సరిహద్దుల ద్వారా చిన్న చిన్న వస్తువులను రవాణా చేస్తుంటారు. కానీ ఇంత మొత్తంలో బంగారం పట్టబడటం చరిత్రలో ఇదే తొలిసారి.
దేశ సరిహద్దుల్లో చొరబాట్ల అరికట్టేందుకు ఇండో చైనా సరిహద్దులోని చిజ్‌బులే, నార్బులా, జాంగిల్, జక్లా ప్రాంతాల్లో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా సోమవారం ఐటీబీపీ 21వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ దీప్ భట్ నేతృత్వంలో బలగాలు తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు బలగాలు యత్నించగా, ముగ్గురు పారిపోయేందుకు యత్నించారు.
జవాన్లు వారిని వెంబడించి, వారి బ్యాగ్‌లను బలగాలు సోదా చేశారు. బ్యాగుల్లో భారీగా బంగారు బిస్కెట్లను గుర్తించారు. వారి నుంచి రెండు మొబైల్స్, రెండు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం 108 బంగారు బిస్కెట్లల్లో ఒక్కో బిస్కెట్ కిలో బరువు ఉంటుందని, ప్రతి బిస్కెట్‌పై ‘గల్ఫ్ గోల్డ్ రిఫైనరీ’ అని ముద్రించి ఉండటాన్ని గుర్తించారు. నిందితులను లద్దాఖ్ ప్రాంతానికి చెందిన త్సెరింగ్, చంబా, స్టాంజిన్ డోర్గ్యాల్‌గా గుర్తించారు. నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు ? వారు ఏయే దేశాలకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయాలపై బార్డర్ పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు.