లాటరీ పద్దతిన లబ్ధిదారుల ఎంపిక...
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. బుధవారం పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో ఏర్పాటుచేసిన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి మంచిర్యాల ఆర్డిఓ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో 560 ఇళ్ళ నిర్మాణం పూర్తికాగా 253 మంది లబ్ధిదారులను మొదటి విడతగా ఎంపిక చేయడం జరిగిందని అందులో 243 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఇండ్లను కేటాయించడం జరుగుతుంద ఆన్నారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా లాటరీ పద్ధతిన లబ్ధిదారుల ఎంపిక చేపట్టినట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే పునర్విచా రణ జరిపి అర్హులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు.
అనంతరం లబ్ధిదారుల సమక్షంలో రెండు పడక గదుల లబ్ధిదారుల ఇండ్లను లాటరీ పద్ధతిలో చేపట్టారు.ఎంపికైన లబ్ధిదారులకు తాత్కాలికంగా లాటరిలో వారికి వచ్చిన ఇంటి, బ్లాక్ నెంబర్లను తెలిపారు. లబ్ధిదారులకు వచ్చిన ఇండ్లను ఇంటి నెంబర్లతో కూడిన ప్రోసీడింగ్ పత్రాలను త్వరలో అందించనున్నట్లు ఆయన వివరించారు. అంతే కాకుండా మిగిలిన ఇండ్లకు మరో విడతలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టి పూర్తి పారదర్శకంగా ఇండ్ల కేటాయింపులు చేపడతామన్నారు. మిగిలిన ఇండ్లకు త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించేందుకు సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ బన్సీలాల్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు, మండల తహశీల్దార్ సతీష్ కుమార్,రెవెన్యూ సిబ్బంది లబ్దిదారులు పాల్గొన్నారు.