calender_icon.png 11 October, 2024 | 7:53 AM

రాజకీయ వేదికగా టీచర్స్ నియామక పత్రాల ప్రోగ్రాం

11-10-2024 01:15:41 AM

 మాజీ ఎంపీ వినోద్‌కుమార్ 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల నియామకాల కార్యక్రమాన్ని సీఎం రాజకీయ వేదికగా మార్చుకుని లబ్ధి పొందాలని ఎత్తులు వేస్తున్నారని మాజీ ఎంపి వినోద్‌కుమార్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీసేస్తే ఉపాధ్యాయులకు ఉద్యోగాలు వచ్చాయని మాట్లాడటం ఆయన వెలికి చేష్టలకు నిదర్శమన్నారు.

గురువారం తెలంగాణ భవన్‌లో గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పల్లె రవికుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ  బీఆర్‌ఎస్ పాలనలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చామని, అయినా వాటిని తాము ప్రచారం చేసుకోలేదన్నారు. ఉద్యోగాల విషయం మంత్రులుగా ఉన్న భట్టి , పొన్నంలకు తెలియక పోతే వారు మంత్రులుగా ఉండటానికి అర్హత లేదన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాలు కూడా సెప్టెంబర్ 6 ,2023 ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపేనన్నారు.  కేవలం ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్‌లో అదనంగా ప్రభుత్వం కలిపిందన్నారు. డిసెంబర్ 31 లోగా 2 లక్షల ఉద్యోగాలను మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.

ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా తెలంగాణ అభివృద్ధి కోసం బాధ్యత నిర్వహించానని, సీఎం హేళనగా మాట్లాడినందుకే  స్పందించాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటైందని చెప్పిన రేవంత్ ఇపుడు కొరివి దెయ్యం అనడం సరికాదన్నారు. లక్షా 62 వేల ఉద్యోగాలు కేసీఆర్ నింపలేదని ఆర్థిక మంత్రి భట్టి చెప్పగలరా అని సవాల్ విసిరారు. 

 టాటాకు భారతరత్న ఇవ్వాలె..

వ్యాపారవేత్త రతన్ టాటా మరణించడం దురదృష్టకరమని, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చరిత్రాత్మకమన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంటాటా గ్రూప్ పెట్టుబడులు పెట్టిందన్నారు.