11-03-2025 09:10:43 PM
నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు..
అధికారులు పట్టించుకోవడం లేదు..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): గ్రామస్తులందరికీ ఉపయోగపడాల్సిన నీటి కులాయినీ కొందరు సొంతానికే వాడుకుంటున్నారు. దీంతో గ్రామస్తులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరికీ వాడుకోవాల్సిన కుళాయిని ఓ ప్రైవేటు వ్యక్తి వాడుకోవడంపై గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు కుళాయి నీటి కోసం క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎండాకాలం వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్న పరిస్థితిలో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మంచినీటి నల్ల ఊరి ప్రజలందరికీ ఉపయోగపడుతుంది.
కొందరు ఆ నీళ్లు ప్రజలకు చేరాల్సిన సమయంలో వాళ్ళ సొంత ప్రయోజనానికి మంచి నీటి నల్ల ద్వారా పైపులు పెట్టి బిల్డింగ్ కు వాడుకొంటున్నారు. ప్రైవేట్ వ్యక్తి అవసరాలు తీరేవరకు కులాయి వద్ద నీటి కోసం ప్రజలు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి నీళ్లు నింపుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు గ్రామస్తులు విన్నవించుకున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా పై అధికారులు స్పందించి గ్రామస్తులకు ట్యాంకు వద్ద గల కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి ఇబ్బందులు ఎదురయ్యేంతవరకు చూడకుండా దీనికి పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.