14-04-2025 01:27:44 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పదో తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విడిపోయి 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న అ‘పూర్వ’ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆదివారం జరిగింది.
స్థానిక జెడ్పీ సెకండరీ పాఠశాలలో 1999 -2000 లో పదో తరగతి పూర్తి చేసిన 60 మంది విద్యార్థులు ఆదివారం పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. తమకు విద్య నేర్పిన గురువులు జగన్మోహన్ రెడ్డి, బద్రి నారాయణ, వెంకట్రాం నరసయ్య, మోహన్ రావు, నరేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
పాతికేళ్ల సమ్మేళనం సందర్భంగా గుర్తుండే విధంగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రావుల శ్రీనాథ్ రెడ్డి, ఎన్నమాల ప్రభాకర్, గొల్లపల్లి వీరాస్వామి, మాసాడి శ్రీను, ఎర్రగుంట్ల అంబదాస్, చిట్టొజు తిరుపతి, బోనగిరి శంకర్, దాసరి ఎల్లయ్య, సపవట్ నందా, సుధాగాని సతీష్ , వెన్ను కోమలత, మాదారపు రమాదేవి పాల్గొన్నారు.