- మా రాష్ట్రానికే ఎక్కువ కావాలని పట్టుబట్టొద్దు..
- కోర్టుకెళ్తామంటే మీకే నష్టం
- కేంద్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు..
- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీలపై కేంద్ర హోంశాఖ సూచనలు
- 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులపై చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ‘నిధుల పంపకాల్లో సానుకూల దృక్పథం ఉండాలి. మా రాష్ట్రానికే ఎక్కువ కావాలని పట్టుబడితే ప్రయోజనం ఉండదు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామంటే, రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది. కోర్టుకెళ్తామంటే మీకే నష్టం.
న్యాయస్థానాల ఆశ్రయిస్తామంటే కేంద్రం చేసేదేమీ లేదు’ అంటూ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు తెల్చిచెప్పినట్లు సమాచారం. ఏపీ పునర్విభజన హామీలపై రెండేళ్ల తర్వాత కేంద్రహోంశాఖ న్యూఢిల్లీలో సమీక్షా నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్ అధ్యక్షత వహించిన సమీక్షకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చ జరిగినట్లు సమాచారం. సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో న్యాయ సలహాలు తీసుకోవాలని, ఇవే అంశాలపై మరోసారి భేటీ అవుదామని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఏపీకి నుంచి డిమాండ్లు..
కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గ్రేహౌండ్స్ కేంద్రం ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్, కేంద్ర సాయం తర్వాత కూడా రెవెన్యూ లోటు భర్తీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు, 13 షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థలు, మౌలిక వసతులు ప్రాజెక్టులు, స్టీల్ ప్లాంట్, పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు, కొత్త రాజధాని నుంచి హైదరాబాద్ సహా ప్రధాన నగరాలకు రోడ్ల అనుసంధానం, రైళ్ల కనెక్టివిటీ, ఢిల్లీ పారిశ్రామిక కారిడార్ తరహాలోనే విశాఖ చెన్నై కారిడార్, విశాఖ, విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో రైలు నిర్మాణం, కొత్త రైల్వే జోన్ కేటాయించాలనే డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి.
తెలంగాణ నుంచి డిమాండ్లు..
కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంట్, 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా సంస్థలు, మౌలిక వసతులు ప్రాజెక్టుల కేటాయింపు, బొగ్గు రవాణాతో 4 వేల మెగావాట్ల విద్యుత్ సదుపాయం, ఒక హర్టికల్చర్, గిరిజన వర్సిటీ ఏర్పాటు, స్టీల్ ప్లాంట్ నిర్మాణం, మారుమూల ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం, రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తెలంగాణ నుంచి ఉన్నాయి.