calender_icon.png 13 January, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ ఎత్తుగడ

17-09-2024 12:00:00 AM

లిక్కర్ కుంభకోణం కేసులో బెయిలుపై తిహార్ జైలునుంచి విడుదలైన రెండు రోజులకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న ట్లు ప్రకటించడం ద్వారా రాజకీయ వర్గాలను ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.అంతేకాదు తాను ఏ తప్పూ చేయలేదని ఢిల్లీ ప్రజలు భావించి తనను గెలిపించే వరకు తిరిగి సీఎం కుర్చీలో కూర్చోబోనని కూడా స్పష్టం చేశారు. తాజా వార్తలను బట్టి కేజ్రీవాల్ మంగళవారమే సీఎం పదవికి రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.

రాజీనామా సమర్పించేందుకు ఆయన లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనా అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చే యడం ఆ పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అనేది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీతో పాటే ఈ ఏడాది నవంబర్‌లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని పరిశీలకుల భావన. 

నవంబర్‌లో మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సిఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోను బీజేపీ పరిస్థితి పెద్ద ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గంతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో అధికార కూటమిలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమైంది.లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార కూటమిలో లుకలుకలు మరింత పెరిగిపోయాయి. ఇక జార్ఖండ్‌లోనూ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా సాగించే ప్రచారం తనకు కూడా తోడ్పడుతుందనేది కేజ్రీవాల్ ఆలోచన. ఒకవేళ ఆయన కోరినట్లుగా నవంబర్‌లో ఎన్నికలు జరక్కపోయినా వచ్చే నష్టమేమీ ఉండదు. ఫిబ్రవరిదాకా ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆయన అవకాశం లభిస్తుంది. తన రాజీనామా అస్త్రంతో ఆమ్ ఆద్మీపార్టీపై ఉన్న అవినీతి మచ్చను కూడా చెరిపేసుకోవచ్చనేది ఆయన మరో ఆలోచన. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకతను సైతం ఎదుర్కొని మూడోసారి అధికారంలోకి రావచ్చనేది ఆయన ఎత్తుగడ కావచ్చు.

అన్నిటికన్నా మించి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం బీజేపీకి లేకుండా చేయడం కూడా ఈ ఎత్తుగడలో భాగమే. కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పటినుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. తాను గద్దె దిగి తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టడం వల్ల ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా చేయవచ్చు.

అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా కేజ్రీవాల్‌కు దక్కేది నైతిక విజయం మాత్రమే తప్ప పూర్తి అధికారం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిలు షరతుల్లో ఆయన ఎలాంటి ఫైళ్లపై సంతకం చేయడానికి కానీ, సెక్రటేరియట్‌కు వెళ్లడానికి కానీ వీలు లేదు. అంతేకాదు ఈ కేసు ఇప్పట్లో తేలేది కూడా లేదు. ఇప్పుడు ఎలా ఉందో ఎన్నికల తర్వాత కూడా పరిస్థితి అంతేనని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, తన స్థానంలో సీఎం పీఠంపై వేరే వాళ్లను కూర్చోబెట్టడం వల్ల ఆ తర్వాత మళ్లీ గద్దెనెక్కడం రాజకీయంగా అంత సులభం కాకపోవచ్చు.

బీహార్‌లో నితీశ్ కుమార్, జార్ఖండ్‌లో శిబూ సోరేన్ ఉదంతాలే ఇందుకు నిదర్శనం.ఇన్ని చిక్కుముడులున్నప్పటికీ తన రాజీనామా నిర్ణయం ద్వారా కేజ్రీవాల్ మాటల్లోనే చెప్పాలంటే ఆయన‘అగ్నిపరీక్ష’కు సిద్ధమయ్యారు. ఈ అగ్నిపరీక్షలో ఆయన పునీతుడై నిలుస్తారా లేదా అనేది ఢిల్లీ ఓటర్ల నిర్ణయంపైన, ఆయన రాజకీయ చతురతపైన ఆధారపడి ఉంది.