మెల్‌బోర్న్: ఈ నెల 12 నుంచి మొదలుకానున్న ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగుతున్నాడు. ఇటీవలే జీక్యూ మ్యాగ జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తనపై విష ప్రయోగం జరిగిదంటూ ఆసక్తికర వ్యాఖ్య లు చేశాడు.
ఆ ఏడాది జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించడంతో నిర్వాహకులు టోర్నీలో పాల్గొన కుండా నిషేధించిన సంగతి తెలిసిందే. ‘2022లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడకుండానే స్వదేశానికి వెళ్లిన నాకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా నుంచి బయల్దేరడానికి ఒక్క రోజు ముందు మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌లో ఆహారం తిన్నా.
అందులో విష ప్రయోగం జరిగిందనిపించింది. నేను తిన్న ఆహారంలో లోహ (మెటల్) భాగం అధికంగా ఉన్నట్లు అనిపించింది. లెడ్‌తోపాటు మెర్క్యూరీ లెవెల్ మోతాదుకు మించి ఉండడంతో ఆహారం విషతుల్యం గా మారింది. వారం రోజులు అనారోగ్య సమస్యలతో బాధపడ్డా’ అని జొకోవిచ్ వెల్లడించాడు. కాగా జొకోవిచ్ వ్యాఖ్యలను న్యూట్రిషియన్, బయో కెమిస్ట్ బార్బరా కార్డోసో ఖండించారు.