09-03-2025 08:29:41 PM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి...
వనస్థలిపురం ఫేజ్-2 కాలనీలో ఖాళీగా ఉన్న స్థలం అభివృద్ధిపై స్థానికులతో ఎమ్మెల్యే సమావేశం...
ఎల్బీనగర్: యువత క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. యువత కోసమే క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఫేజ్-2 లో ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కొందరు... కాదు కాదు... క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థలం అభివృద్ధిపై ఆదివారం స్థానికులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో యువకులు, కాలనీవాసులు పాల్గొని, తమ అభిప్రాయాలు చెప్పారు. కాలనీవాసులు పార్క్ నిర్మించాలని, యువత ప్లే గ్రౌండ్ నిర్మించాలని కోరారు.
కాలనీవాసులు మాట్లాడుతూ... మైదానంగా ఏర్పాటు చేస్తే రాత్రిపూట మద్యం తాగుతూ నానా హంగామా చేస్తున్నారని, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతూ పక్కఇంటి అద్దాలు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో పెద్దగా శబ్దాలు పెట్టి హంగామా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలు రాకుండా పార్కు నిర్మించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఇక్కడి మైదానానికి సుమారు 50 అడుగుల దూరంలో జయశంకర్ పార్కు ఉన్నదని, 100 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ వెనుక పార్కు ఉన్నదని, 150 అడుగుల దూరంలో రైతు బజార్ దగ్గర అతి పెద్ద పార్కు ఉందని వివరించారు. తన హయాంలో దూరదృష్టితో ఆలోచించి 8 నుంచి 80 ఏండ్ల లోపు ప్రజలు ఉత్సాహంగా, ఆరోగ్యకరంగా ఉండాలని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అనేక పార్కులు నిర్మించినట్లు గుర్తు చేశారు. కానీ, యువత ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవన్నారు.
యువత కోసమే ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యువతకు ప్లే గ్రౌండ్స్ కావాలనే ఉద్దేశంతో వనస్థలిపురం ఫేజ్ -2 కాలనీలో ప్లే గ్రౌండ్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొంత మంది చిల్లరదొంగలు వారి రాజకీయ మనుగడ కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. యువత కోసం ప్లే గ్రౌండ్ నిర్మిస్తామని తెలిపారు. ప్లే గ్రౌండ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేయిస్తామన్నారు. ప్లే గ్రౌండ్ చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి, ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యువత చేడు అలవాట్లకు పోకుండా ఉండాలని సూచించారు.
మహిళల కోసం క్రికెట్ నెట్ ఏర్పాటు చేస్తామని, కొంతమేర వాకింగ్ ట్రాక్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యువత భవిష్యత్ కోసం మీ యొక్క సహాయసహకారాలు అందించాలని ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, నాయకులు సంజయ్ కుమార్, శివశంకర్, మిట్టా రామ్మోహన్, కాలనీవాసులు జగదీశ్, ప్రవీణ్, అశోక్ కుమార్ గౌడ్, బీరప్ప, శోభ, అనుప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.