23-03-2025 10:32:45 PM
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేసేందుకు ప్రయత్నం..
తహర్ వాహనంతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం..
మునిపల్లి: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర చేసిందని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామానికి చెందిన కొమిసెట్టిపల్లి రవి ఝరాసంగం మండలం దేవరంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సంగారెడ్డికి చెందిన హరితను 2021లో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ప్రతిరోజు మాదిరిగానే దేవరంపల్లి గ్రామంకు వెళుతుండగా శనివారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా స్వగ్రామమైన పెద్ద గోపులారం గ్రామానికి వస్తున్న క్రమంలో జహీరాబాద్ వైపు నుంచి తార్ కార్ వెంబడించిందన్నారు.
భర్తను ఎలాగైనా హత్య చేయాలని ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసిన భార్య రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. తార్ వాహనం వెంబడించడంతో రవి గమనించి వెంటనే బుదేరా చౌరస్తాలో తన సైకిల్ మోటార్ ను నిలిపారని తెలిపారు. బైకు ఆపిన వెంటనే తార్ మోటార్ నిలిపివేయడం జరిగిందన్నారు. వెంకట కాజా దర్గా వద్దకు రాగానే రవి బైకును తార్ కారు ఢీకొట్టడంతో రవి తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి కంకల్ టోల్ ప్లాజా వద్ద వివరాలు సేకరించారన్నారు. కట్టుకున్న భార్య ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ చేశారని తెలిపారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన రవి భార్య హరిత ప్రియుడు మీరు దొడ్డి సాయి ప్రదీప్, దాసోజి సాయికిరణ్ పై కేసు నమోదు చేశామన్నారు.