26-03-2025 12:44:59 AM
పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, మార్చి 25 ( విజయక్రాంతి ) : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, ఆలంపూర్ యొక్క ఆధ్యాత్మిక/యాత్రా అవసరాలు, స్థిరమైన పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రధాన ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జోగులాంబ దేవస్థానం అభివృద్ధి కొరకు ఏర్పాటైన పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆలంపూర్ తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా ఉన్నందున, దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయ అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు,ఆలయ పరిసరాల అభివృద్ధి, మరియు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
ప్రసాద్ పథకం భవనానికి నీటి సరఫర కోసం మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈ.ఈ,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు నది నుంచి నీటి శుద్ధి విషయంపై ఫీల్ విజిట్ నిర్వహించి,15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలన్నారు. ప్రసాద్ పథకం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవదాయ శాఖకు అప్పగించాలని సూచించారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి గాంధీ జంక్షన్ నుండి ఆలయం వరకు రహదారి వివరాలు సిద్ధం చేయాలని,మురుగునీటి కాలువ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ రావు, అసిస్టెంట్ స్థాపతి గణేష్,ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈ.ఓ పురేందర్,డిపిఓ నాగేంద్రం, అలంపూర్ తహసీల్దార్ మంజుల,మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్ రావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస రావు, ఆర్ అండ్ బిఎస్.ఈ. వనజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.