calender_icon.png 20 September, 2024 | 11:16 PM

నెస్ట్స్ స్టీరింగ్ కమిటీలో డా.శరత్‌కు చోటు

20-09-2024 01:37:43 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ శరత్‌కు జాతీయ కమిటీలో చోటు లభించింది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(నెస్ట్స్)లో ఆయన్ను స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ గురువారం కేంద్ర గిరిజన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శరత్ ఏడాదిపాటు ఈ కమిటీలో సభ్యునిగా కొనసాగుతారు. నెస్ట్స్  కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ. గిరిజన జనాభా అధికంగా ఉండి, అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యా బలోపేతానికి గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్  పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది.

ఈ స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందించడంపై కమిటీ పనిచేయనుంది. ఈ సందర్భంగా గిరిజన, ఏకలవ్య, మోడల్ స్కూల్స్, గిరిజన గురుకుల సిబ్బంది డా.శరత్‌ను అభినందించారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్‌గా కూడా చేశారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఆయన్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించింది.