బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో ఆరిజిన్ డైరీ ఏర్పాటు కోసం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనకు అమ్మిన లావని పట్టా భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంపిణీ చేయాలని కోరుతూ ఆదివారం ఏఎంసి వద్ద గల కాకా వెంకటస్వామి విగ్రహానికి ఆరిజిన్ డైరీ డైరెక్టర్ కందిమల్ల ఆదినారాయణ వినతి పత్రం అందజేశారు. రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆరిజిన్ డైరీని ఏర్పాటు చేయగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను నమ్మించి ప్రభుత్వ భూమిని తనకు అమ్మాడని, రిజిస్ట్రేషన్ చేపిస్తానని నమ్మించి మోసం చేశాడని వినతి పత్రంలో ఆరోపించారు.
ఈ భూమిని పేదలకు పంచాలని రెండు సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు దుర్గం చిన్న యామిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వెంటనే పేదలకు పంచాలని మీ వారసులైన బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని వేడుకుంటున్నట్లు వినతి పత్రంలో ఆయన పేర్కొన్నారు.