బెల్లంపల్లి (విజయక్రాంతి): మహిళల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మహిళా సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. మహిళల సమావేశాల కోసం ఒక సింగరేణి క్వార్టర్ ను ఇప్పించాలని, ఎమ్మెల్యేను కలవడానికి మహిళలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని వారు వినతి పత్రంలో కోరారు. బీసీ బాలికల గురుకులాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయించడంతో పాటు రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఎర్ర సువర్ణ, హనుమాండ్ల రమాదేవి, సుంకరి లక్ష్మి, భాగ్య, విజయలక్ష్మి లు పాల్గొన్నారు.