ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26: పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ రాఘ వేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం కుర్మలగూడలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అనుమా నాస్పదంగా సంచరిస్తున్నారని సాయంత్రం 4 గంటలకు బద్రమోని మధు అనే వ్యక్తి పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ముగ్గురిలో సంతోష్‌నగర్‌లోని బాబానగర్‌కు చెందిన మహ్మద్ హాజీ(43), సైదాబాద్‌కు చెందిన రత్లావత్ గోవింద్(27), బ్రహ్మణపల్లికి చెందిన నెనావత్ నరేష్(25) ఉన్నారు.
ఆదిభట్ల పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మహ్మద్ హాజీకి ఛాతిలో నొప్పి లేవడంతో తుర్కయంజాల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కొన్ని రోజుల నుంచే హాజీ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని సీఐ తెలిపారు. గుండె స్టంట్లు కూడా పడ్డాయని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు.