ముషీరాబాద్, ఆగస్టు 14: బిల్డింగ్ పైనుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాజు కథనం ప్రకారం.. కవాడిదగూడ తాళ్లబస్తీకి చెందిన సేరల రేణుబాబు (48) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. రోజు మాదిరిగానే ఆటో డ్రైవింగ్‌కు వెళ్లిన రేణుబాబు మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి ఎదురుగా ఉండే స్నేహితుడు అ మర్ పిలవడంతో వెళ్లాడు.
కొంతసేపటి తర్వాత రేణుబాబు భార్య తన కుమారుడు సాయిపవన్‌ను పంపించగా.. అమర్ ఇంటి మొదటి అంతస్తులో రేణుబాబుతో పాటు మరో నలుగురు మద్యం తాగుతూ ఉండడం కనిపించి తన తల్లికి చెప్పాడు. అయితే, రాత్రి 12.30 గంటల తర్వాత భవనం పైనుంచి ఓ వ్యక్తి కిందపడి ఉన్నాడని సమాచారం రావడంతో వెళ్లి చూడగా రేణుబాబు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన భర్త మృతిపై అనుమానం ఉందని, అతనితో కలిసి మద్యం తాగిన నలుగురిపై కేసు నమోదు చేసి విచారించాలని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాంధీనగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి
మెదక్ : టిప్పర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన నాగమల్లి శ్రీనివాస్ (65) బుధవారం మధ్యాహ్నం రాందాస్ చౌరస్తా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ టిప్పర్ లారీని దాటి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించని టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు నడపడంతో అది శ్రీనివాస్ పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.