calender_icon.png 23 September, 2024 | 12:00 PM

నివాసాల మధ్యలో పర్మిట్ రూమ్

23-09-2024 01:27:47 AM

ఇంటి గేటు ముందే సిట్టింగ్ వేస్తున్న మందుబాబులు

ఇబ్బంది పడుతున్న మహిళలు, విద్యార్థులు

సిద్దిపేట, సెప్టెంబరు ౨౨ (విజయక్రాంతి): తాగి ఇంటికి వచ్చే వారిని భరించడమే ఇబ్బందికరమంటే ఇక ఇంటి గేటు ముందే బయటి వ్యక్తులు మద్యం సేవిస్తుంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వైన్‌షాపుకు ఆనుకొని ఉండాల్సిన పర్మిట్ రూమ్ షాపునకు దూరం గా నివాసాల మధ్య ఉండటంతో ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా మారింది. మహిళలు ఇంటి బయటకు వెళ్లాలన్నా.. బయటి నుంచి ఇంటిలో పలకి రావాలన్నా మద్యం మం దుబాబుల అగచాట్లు భరించాల్సిందే.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం లోని 17వ వార్డులోని రాజీవ్‌గాంధీ చౌర స్తా వద్ద ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మ వైన్‌షాపునకు సంబంధించిన పర్మిట్‌రూమ్‌ను షాప్‌నకు ఆనుకొని కాకుండా కొంతదూరంలో నివాసాల మధ్య ఏర్పాటు చేశారు. దీంతో వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినవారు పర్మిట్ రూమ్‌తో పాటు దాని పరిసరాల్లో పూటుగా మద్యం తాగి సీసాలు, ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా పడవేయడం, బహిరంగంగా మలవిస ర్జన చేయడం వంటి పనులు చేస్తుండటంతో కాలనీలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడటంతో పాటు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పర్మిట్‌రూ మ్‌కు ఆనుకొ ని ఇళ్లు ఉండగా.. కొంతమంది మందుబాబులు సౌకర్యంగా ఉం టుందని ఇంటి గేటు, గోడకు ఆనుకొని ఉండే చబుత్రాలపై సిట్టింగ్ వేసి మద్యం సేవిస్తున్నారు. మద్యం ఎక్కువగా తాగిన కొంత మంది సృహ కోల్పోయి ఇళ్లముందే పడిపోతున్నారు. ఈ విషయమై స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉద యం 10 గంటల తర్వాత మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, బయటకు వెళ్లిన వారు ఇంటికి రావాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే వైన్ షాపునకు సమీపంలోనే ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కాలనీలోని పర్మిట్ రూమ్‌ను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

పర్మిట్‌రూమ్‌ను షిఫ్ట్ చేయాలి

పర్మిట్ రూమ్ నివాసాల మధ్యలో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. మహిళా కౌన్సిలర్ ఉండి సాటి మహిళలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకపోతే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది. మున్సిపల్ సిబ్బంది పర్మిట్‌రూమ్ పరిసరాలను శుభ్రం కూడా చేయడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పర్మిట్ రూమ్‌ను వేరేచోటుకు షిఫ్ట్ చేయించాలి.

 ఆనంద్, దుబ్బాక

ఇళ్ల మధ్య నుంచి తొలగించాలి

ఇళ్ల మధ్య పర్మిట్ రూమ్ ఏర్పాటుకు ఎలా పర్మిషన్ ఇస్తారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మహిళలు బయటకు రావాలంటే ఇబ్బంది పడుతు న్నాం. మందుబాబులు మా ఇళ్ల ముందు కుర్చొని మద్యం సేవిస్తున్నారు. రాత్రి వేళల్లో గేటు ముందే నిద్రపోతున్నారు. ఫొటోలు తీసి అధికారులకు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. త్వరలో స్థానిక మహిళలందరం కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం.

 లక్ష్మి, దుబ్బాక