22-12-2024 01:23:32 AM
* ఇదే మా ప్రభుత్వానికి శ్రీరామరక్ష
* అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చట్టమే మాకు రెఫరండం
* ధరణితో రైతులు ఎంతో నష్టపోయారు
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
* మండలిలో బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా తీసుకొచ్చిన ‘భూ భారతి’ చట్టం రానున్న రోజుల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలకు మార్గదర్శిగా మారనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ భారతి పేరులోనే ప్రత్యేకత ఉందని, భూమిని భారతదేశాన్ని కలిపే ఈ చట్టం ప్రజలకు మంగళప్రదమైన హారతిని పడుతుందని.. భూ యజమానుల జీవితాల్లో సరికొత్త కాంతులను ప్రసరింపజేస్తుందన్నారు.
శనివారం శాసనమండలిలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 భూ భారతి చట్టం మా ఇందిరమ్మ ప్రభుత్వానికి శ్రీరామరక్ష.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చట్టం మాకు రెఫరండమేనని తెలిపారు. దేశంలో, రాష్ర్టంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు, చట్టాలు నేటి వరకు రైతులు, సామాన్యులకు ఎంతో మేలు చేశాయని వెల్లడించారు.
ఈ బిల్లును చూసి బీఆర్‌ఎస్ నేతలకు కన్నుకుట్టిందని ఎద్దేవా చేశారు. అందుకే శాసన సభలో గలాటా చేశారని, వీరి కపట నాటకం ప్రజలకు అర్ధమైందన్నారు. పూర్తిగా అమలులోకి వస్తే ప్రతిపక్ష పార్టీ పెద్దలు దోచుకున్న భూముల వివరాలు బయటపడతాయని, అప్పుడు ఈ చట్టం పవర్ ఏంటో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా..
దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న ఆర్‌వోఆర్ చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి, వడపోసి ప్రజలకు అత్యంత ఉపయోగపడేలా ఈ నూతన చట్టానికి ప్రాణం పోశామన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండ లం, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించామని మంత్రి వివరించారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయా లు, సూచనలు, సలహాలు స్వీకరించినట్టు గుర్తు చేశారు. ఈ బిల్లు దేశానికే దిక్సూచిగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో నెంబర్ వన్‌గా.. దేశానికి ఆదర్శంగా, ఒక రోల్ మోడల్‌గా ఈ చట్టం ఉండబోతుందన్నారు.
ధరణి చట్టంలో ఎన్నో లోపాలు
ధరణి రికార్డుల సవరణకు ఏ అధికారికి అధికారం లేదని, ప్రతి సమస్య పరిష్కారానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనన్నారు. గతంలో రైతులకు సమస్య వస్తే రెవెన్యూ కార్యాలయాల్లో పరిష్కారం దొరికేదని, ధరణి వచ్చాక రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఎలాంటి అప్పీల్, రివిజన్ చేసుకునే మెకానిజం లేదని, భూరికార్డుల ప్రక్షాళన జరుగుతున్న సందర్భంగా చిన్నా చితక సమస్యలు ఉన్నాయని తరువాత రోజుల్లో పరిష్కారం చేస్తామని పార్టు- జాబితాలో పొందుపర్చారు. మిగతా భూములను పార్టు- లో చేర్చి కొత్త పాసుపుస్తకాలు ఇచ్చారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్టు లో చేర్చిన భూములకు ఈ చట్టం ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు.
కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలలో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తామని.. ఒక వేళ పట్టాదారు చనిపోతే సభ్యుల పేరు మీద పట్టా మార్పిడి ఆటోమెటిక్‌గా చేస్తామని చెప్పారు. పాసుపుస్తకంలో అలాంటి వివరాలు ఏవీ ఇప్పటికీ నమోదు కాలేదన్నారు. మరోపక్క మ్యుటేషన్ చేసే ముందు విచారణ చేసే అధికారం లేకపోవడంతో భాగస్వామ్య పంపకాలలో అన్నాదమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు పెరిగాయని వెల్లడించారు. ఈ సందర్భంగా భూభారతి బిల్లుపై విపక్ష పార్టీల సభ్యులు సలహాలు, సూచనలు చేశాక మండలిలో బిల్లు ఆమోదం పొందింది.
ధరణితో బీఆర్‌ఎస్ విధ్వంసం
2020 నూతన రెవెన్యూ చట్టం.. ధరణి పోర్టల్ ఒక విప్లవాత్మకం అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో సృష్టించిన విధ్వంసం ఏమిటో ప్రజలకు తెలుస్తుందన్నారు. రైతులు భూములపై పెట్టుకున్న ఆశలను బీఆర్‌ఎస్ సమాధి చేసిందని మండిపడ్డారు. రెవెన్యూ సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం చేసిన దాష్టికానికి అన్నదాతలు అనుభవించిన బాధలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా తీసుకొచ్చిన చట్టంతో అమాయక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.