18-04-2025 01:52:21 AM
ఎమ్మెల్యే బాలు నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ, ఏప్రిల్ 17: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్తో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ పేర్కొన్నారు. గురువారం చింతపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, దేవరకొండ రైతు వేదికలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో వివాద రహిత భూవిధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిందని చెప్పారు.
రైతులతో ముఖాముఖి మాట్లాడారు. భూభారతిపై నూతన విధివిధానాలను వివరించారు. జూన్ 2 నుంచి ఆన్లైన్లో భూభారత్ పోర్టల్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పీ మౌనిక, జేసీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, తహసీల్దార్ శర్మ, ఎంపీడీవో సుజాత, అగ్రికల్చర్ ఏడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.