calender_icon.png 26 October, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాండూట్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం

26-10-2024 12:22:13 AM

  1. వందేళ్ల నాటి గండిపేట కాండూట్‌కు మరమ్మతులు
  2. నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పనులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): నగరంలో వందేళ్ల చరిత్ర కలిగిన గండిపేట్ కాండూట్ లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. పదేళ్లుగా కాండూట్ నుంచి అవుతున్న లీకేజీలకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ఈ పనులు చేపట్టింది. 1920లో ప్ర జల తాగునీటి అవసరాల కోసం నాటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ 4, 5, 6 పరిధిలో వినియోగదారులకు తాగునీరు సరఫరా అవుతోంది. 

నీరు వృథా కాకుండా చర్యలు

గండిపేట్ నుంచి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్ వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా గ్రావిటీ ద్వారానే మొత్తం నీటి సరఫరా జరుగుతుంది. ఫిల్టర్‌బెడ్‌లో నీటిని శుద్ధి చేసిన తర్వాత వినియోగదారులకు సరఫరా చేస్తారు. గండిపేట్ నుంచి నగరానికి మొత్తం 26 ఎంజీడీల తాగునీరు సరఫరా చేసే సామర్థ్య ఉంది.

ప్రస్తుతం 20 ఎండీజీల నీటిని సరఫరా చేస్తే అందులో దాదాపు 8 ఎంజీడీల నీరు లీకేజీల వల్ల వృథాగా పోతోంది. దాదాపు 14.5 కిలోమీటర్ల మేర 45 ప్రాంతాల్లో ఈ లీకేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన పనులు పూర్తయితే మరో 14 ఎంజీడీల నీటిని వినియోగదారులకు సరఫరా చేయొచ్చు.

జర్మనీ టెక్నాలజీతో లీకేజీలకు చెక్ 

గండిపేట్, కోకాపేట్, మణికొండ, సీబీఐటీ కాలేజీ, పుప్పాలగూడ, జానకీనగర్, కౌసర్‌కాలనీ, ఎంఈఎస్ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో పదేళ్లుగా ఎక్కువ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలకు మరమ్మతులు చేపడితే నెలరోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.

అంతరాయం కలగ కుండా మరమ్మతులు చేసేందుకు జర్మనీ టెక్నాలజీతో చెన్నైకి చెందిన కంపెనీతో లీకేజీలను అరికట్టే పనులు చేపట్టారు. ఇందులో భాగంగా లీకేజీ ఉన్న ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో నీటిని ఖాళీ చేసి ఆ ప్రదేశంలోకి ప్రత్యేక రసాయనాన్ని పంపించడంతో క్షణాల్లో ఆ రసాయనం ఘనీభవించి ఖాళీ పూడుకుపోతుంది. ఈ పద్ధతితో నీటి సరఫరాకు ఆటంకం కలగకుండానే మరమ్మతులు పూర్తి చేయొచ్చు. 

పనులను పర్యవేక్షించిన ఎండీ అశోక్‌రెడ్డి

కాండూట్‌కు ఏర్పడ్డ లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన పనులను శుక్రవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో సీజీఎం రవీందర్‌రెడ్డి, ట్రాన్స్‌మిషన్ అధికారులు పాల్గొన్నారు.