01-04-2025 10:25:43 PM
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ “నేను ప్రామిస్ చేసి చెబుతున్నా. ఇది ఒక గ్రేట్ మూవీ. అందరినీ నవ్వించే సినిమా. ఏప్రిల్ 18 నుంచి తెలుగు ప్రేక్షకులకు సంపూర్ణ వినోదం అందబోతోంది. ఈ మూవీ టీమ్ బ్రిలియంట్ టీమ్.. ఇది నా డ్రీమ్ టీమ్.. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’ సినిమాతో తీరింది. ఫేవరెట్ టీచర్ దగ్గర చదువుకోవడం లాంటిది ఆయనతో పనిచేయడం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఒక పాజిటవ్ ఫోర్స్. మా యూనిట్ అందరి జాతకాలు చాలా బాగున్నాయి. మేం చక్కని విజయాన్ని అందుకోబోతున్నాం” అన్నారు.
కథానాయిక రూప కొడువాయూర్ మాట్లాడుతూ.. ‘నాకు జాతకాల మీద నమ్మకం ఉండేది కాదు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నా ఫేవరెట్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి అని చెప్పాను. ఊహించనివిధంగా ఆయన సినిమాలో నటించే ఆఫర్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ధరించే అవకాశం లభించింది’ అన్నారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. “శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ఇది నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరిమధ్య కొనసాగుతోంది. ‘సారంగపాణి జాతకం’ సకుటుంబ సపరివార సమేతంగానే కాకుండా పరకుటుంబ సమేతంగా కూడా చూడదగ్గ చక్కని హాస్యభరిత సినిమా. ప్రియదర్శితో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిస్తోంది. ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన సినిమా ‘కోర్ట్’ చక్కని విజయం సాధించింది. మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ సినిమాతో మా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా ప్రియదర్శికి టైలర్‌మేడ్‌లా ఉంటుంది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ చాలా బాగా చక్కగా నటించింది. ఈ సినిమాలో నాన్ తెలుగు యాక్టర్లు ఎవరూ లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. అందరూ ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్లకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు” అన్నారు.
నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, “నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ నాని ‘జెంటిల్‌మన్’తోనే. దాని తర్వాత చక్కని ప్రేమకథతో సుధీర్‌బాబు హీరోగా ‘సమ్మోహనం’ తీశాం. ఈ రెండూ మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ‘సారంగపాణి జాతకం’ కొనసాగిస్తుంది. జంధ్యాలతో ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమా రాయించుకున్నా.. ‘ఆదిత్య 369’ సినిమా రాయించుకున్నా. ఆయనతో ఒక కామెడీ సినిమా తీయాలనుకున్నా. కానీ కుదరలేదు. మంచి కామెడీ సినిమా తీయాలన్న కోరిక ‘సారంగపాణి జాతకం’తో తీరింది. ఈ సినిమాను రెండు నెలల ముందే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, సమ్మర్‌లో కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అనే ఉద్దేశంతో ఏప్రిల్ 18 విడుదల చేస్తున్నా. ఇది జాతకాల మీద తీసిన సినిమా. నేను భగవంతుణ్ణి, జాతకాలను నమ్ముతా. ఎందుకు నమ్ముతానంటే, ఒక బ్యాడ్ పిరియడ్ ఉన్నప్పుడు ఇన్నాళ్లు నాకు బ్యాడ్ పిరియడ్ తప్పదని కొంతమంది చెప్పారు. 2015 నుంచి నా జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అందుకే ఒక ‘జెంటిల్‌మన్’ వచ్చింది. ఒక ‘సమ్మోహనం’ వచ్చింది. ఒక ‘యశోద’ వచ్చింది.. యశోద ఒక కాంట్రవర్షియల్ పాయింట్‌తో తీసింది. చాలామంది వద్దు నిరుత్సాహపరిచారు. అయినా సమంతతో విజయం అందుకున్నా. ‘సారంగపాణి జాతకం’ కథ విన్న తర్వాత ‘అద్భుతం.. మనం హిట్ కొడుతున్నాం’ అన్నాను. నమ్మకంతో ఈ సినిమాని నిర్మించాను. సినిమా విడుదల రెండు నెలలు ఆగింది. ఎందుకు ఆగింది... అది ఈశ్వరేచ్ఛ.. ఏప్రిల్ 18 తర్వాత నేను అందరి చేత అభినందనలు అందుకుంటానన్న నమ్మకం నాకు ఉంది. కేవలం జాతకాలను మాత్రమే నమ్మకూడదు.. మనం చేయాల్సింది మనం చేయాలి అని చెప్పే సినిమా ఇది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నా” అన్నారు.
నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాల్లో నటించడం ఎప్పుడూ నాకు స్పెషల్‌గానే ఉంటుంది. చిన్న రోల్‌తో సినీ జీవితాన్ని ప్రారంభించి, నటుడిగా ఒక్కో మెట్టుగా ఎదుగుతున్న ప్రియదర్శి ఈ సినిమా ద్వారా మరో విజయాన్ని, అభినందనలు అందుకుంటారు’ అని తెలిపారు.
ఇంకా నటీనటులు అశోక్‌కుమార్, ప్రదీప్ రుద్ర, నివితా మనోజ్, వడ్లమాని శ్రీనివాస్, సమీర భరద్వాజ్, సినిమాటోగ్రాఫర్ పీజీ విందా కూడా ఈ వేదికపై మాట్లాడుతూ తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకున్నారు. మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.