calender_icon.png 27 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డుల ర్యాలీకి విరామం

29-06-2024 12:46:38 AM

  • కొత్త గరిష్ఠస్థాయి నుంచి వెనక్కు తగ్గిన సూచీలు

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో లాభాల స్వీకరణ

న్యూఢిల్లీ, జూన్ 28: కొద్ది రోజులుగా దూకుడు చూపించిన బుల్స్ శుక్రవారం స్వల్ప విరామం తీసుకున్నారు. బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కొత్త గరిష్ఠస్థాయిల నుంచి వెనక్కు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభ సమయంలో జోరును కొనసాగించిన బీఎస్‌ఈ  సెన్సెక్స్ తొలుత 428 పాయింట్లు పెరిగి 79,672 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. మధ్యాహ్న సెషన్ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ షేర్లలో అమ్మకాలు ప్రారంభంకావడంతో సెన్సెక్స్ వెనక్కు మళ్లింది.  చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 210 పాయింట్ల తగ్గుదలతో 79,032 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇంట్రాడే రికార్డుస్థాయి నుంచి 630 పాయింట్లకుపైగా తగ్గింది. ఇదేబాటలో  ఇంట్రాడేలో 129 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 24,174 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 34 పాయింట్ల నష్టంతో 24,010 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గురువారం చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 79,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 24,000 పాయింట్ల స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,033 పాయింట్లు లాభపడగా, వారం మొత్తంమీద 1,822 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ వారం మొత్తంలో 522 పాయింట్లు లాభపడింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.439.24 లక్షల కోట్ల (5.26 ట్రిలియన్ డాలర్లు) రికార్డుస్థాయికి చేరింది. 

ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.61 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు 1 శాతం మధ్య తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో రోజు పెరిగి రూ.3,161 వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని తాకింది. చివరకు 2.31 శాతం లాభంతో రూ.3,132 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, టైటాన్ షేర్లు 1.85 శాతం వరకూ పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో బ్యాంకెక్స్ అధికంగా 1.04 శాతం నష్టపోయింది. టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్  0.65 శాతం, ఫైనాన్షియల్ సర్వీసుల ఇండెక్స్ 0.52 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.42 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.26  శాతం చొప్పున తగ్గాయి.  హెల్త్‌కేర్, ఎనర్జీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీస్, కమోడిటీస్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.56 శాతం లాభపడింది.

రూ.21 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు వరుసగా మూడు రోజులపాటు జరిపిన ర్యాలీతో ఆ కంపెనీ మార్కెట్ విలువ శుక్రవారం రూ.21 లక్షల కోట్ల స్థాయిని మించింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీగా గత కొద్ది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆర్‌ఐఎల్ తాజాగా రూ.3,161 వద్ద కొత్త రికార్డుస్థాయిని తాకింది. చివరకు 2.31 శాతం లాభంతో రూ.3,132 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 47,777.57 కోట్లు పెరిగి రూ.21,18,951.20 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌ఐఎల్ రూ.20 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. 2024లో ఇప్పటివరకూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 21.16 శాతం పెరిగింది.