02-03-2025 07:43:48 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): శాంతి ఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ను రాజకీయాలకతీతంగా పోరాటం చేసి అడ్డుకుంటామని మాజీ జెడ్పిటిసి కారుకూరి రాంచందర్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి మండలంలోని పెరికపల్లి గ్రామంలో శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభావిత గ్రామాల ప్రజలు ఐక్యతతో ఉద్యమించి సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభావిత గ్రామాల రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లి ఈనెల 6న బెల్లంపల్లిలోని శాంతిఖని గని వద్ద సింగరేణి యాజమాన్యం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు జీవాధారమైన పల్లెల్లో సింగరేణి చేపట్టే విధ్వంసకర చర్యలను ప్రతి ఒక్కరు సంఘటితంగా అడ్డుకోవాలని ఆయన కోరారు.