calender_icon.png 26 September, 2024 | 1:55 AM

ప్రైవేటు దవాఖానలో నవజాత శిశువు మృతి

09-09-2024 01:27:39 AM

  1. వైద్యుడి నిర్లక్ష్యమేనంటూ తల్లిదండ్రుల ఆరోపణ 
  2. దవాఖాన అద్దాలు ధ్వంసం చేసిన బంధువులు

నల్లగొండ, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని రెయిన్ బో దవాఖానలో నవజాత శిశువు మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. డిండి మండలం ఎర్రారం పంచా యతీ ఆవాసం సోమ్లానాయక్ తండాకు చెం దిన ఇస్లావత్ జ్యోతి ఈ నెల 6న దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో మగ శిశువుకు జన్మనిచ్చింది. విధుల్లో ఉన్న పిల్లల వైద్యుడు బాబూరావు నాయక్ శిశువును పరీక్షించి కామెర్లు తీవ్రంగా ఉన్నాయని, పరిస్థితి విషమంగా ఉన్నదని వెంటనే ప్రైవేటు దవాఖాన కు వెళ్లాలని సూచించాడు. స్థానికంగా తనకే చెందిన రెయిన్‌బో దవాఖానకు పంపి శిశువుకు చికిత్స ప్రారంభించాడు.

శనివారం వెంటిలేటర్‌పై ఉంచి బయటకు వెళ్లి సకాలంలో రాలేదు. ఫోన్ చేసినా స్పందించకపో వడంతో పరిస్థితి విషమించి శిశువు మృతి చెందింది. దీంతో వైద్యుడి తీరుపై శిశువు తల్లిదండ్రులు జ్యోతి, రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్ల తరువాత తమకు బిడ్డపుడితే వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి బలితీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. బంధువులు దవాఖాన అద్దాలను ధ్వంసం చేశారు. వైద్యుడిపైనా దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. శిశువు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే సకాలంలోనే స్పందించి వైద్యం చేశానని, ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతోనే శిశువు మృతి చెందిందని సదరు వైద్యుడు తెలిపారు. కాగా వైద్యుడిని బాధిత కుటుంబీకులు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.