calender_icon.png 4 March, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులకు కొత్తమార్గం!

04-03-2025 01:42:09 AM

  1. ‘సోషల్ ఇంపాక్ట్ బాండ్ల’ను తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
  2. ఇప్పటికే ఈ తరహా బాండ్లను ప్రవేశపెట్టిన మహారాష్ట్ర, రాజస్థాన్
  3. ‘ఎస్‌ఐబీ’లతో ఇటీవల రూ.వెయ్యి కోట్లను సమీకరించిన నాబార్డ్
  4. త్వరలో అమలు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రణాళికలు
  5. రాష్ట్రంలో కూడా ఎస్‌ఐబీలను తీసుకొచ్చేందుకు సర్కారు సమాలోచనలు
  6. 2025-26 బడ్జెట్‌లో రూ.3,000కోట్లు సమీకరించేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఆదాయం తగ్గడంతో నిధుల సమీకరణపై తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.  అందులో భాగంగా ‘సోషల్ ఇంపాక్ట్ బాండ్ల(ఎస్‌ఐబీ)’ ద్వారా నిధులను సమీకరించుకునేం దుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈమేరకు ఇటీవల ప్రభుత్వం ఆర్థిక శాఖ ను ఆదేశించింది.

సోషల్ ఇంపాక్ట్ బాండ్ల ను స్టాక్ మార్కెట్‌లో ఇష్యూ చేయడం ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేందుకు ఉన్న అవకాశాన్ని ఆర్థిక శాఖ ప్రభు త్వం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో 2025 బడ్జెట్‌లో ఎస్‌ఐబీలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐబీలనే డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ బాండ్స్ అని కూడా అంటారు.

సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టే ఆర్థిక సాధనాలు సోషల్ ఇంపాక్ట్ బాండ్స్. ప్రభుత్వాల బడ్జెట్ తగ్గుతున్నప్పుడు సామాజిక సమస్యలను పరిష్కరించడానికి, వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన సేవలను అందించేందుకు ఈ బాండ్లు సాయపడుతాయి.

3,000కోట్లు సేకరణకు ప్రణాళికలు

ఎస్‌ఐబీలను ఇష్యూ చేయడం ద్వారా  నాబార్డ్ ఇటీవల రూ.వెయ్యి కోట్లను సమీకరించింది. దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు మాత్రమే ఎస్‌ఐబీలను ప్రవేశపెట్టాయి. ఇందులో మహా రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని మెరుగుపర్చడానికి బాండ్లను ఇష్యూ చేసింది. రాజస్థాన్ ప్రభు త్వం 2015లో బాలికల అక్షరాస్యతను పెంచడం కోసం ఈ బాండ్లను తీసుకొచ్చింది.

ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఎస్‌ఐబీలను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆ రాష్ట్రం ఎస్‌ఐబీలను ప్రకటించనుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభు త్వం కూడా 2025-26 బడ్జెట్‌లో ఎస్‌ఐబీలను ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్న ట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలి విడత కింద రూ.3,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.3,000కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆర్థిక శాఖ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇది విజయవంతమైతే మరిన్ని నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం..

ఏదైనా ఒక సామాజిక సమస్యను ఎజెండాగా చేసుకొని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం స్టాక్ మార్కెట్‌లో సోషల్ ఇంపాక్ట్ బాండ్స్ ను ఇష్యూ చేస్తుంది. ఎన్‌ఎస్‌ఈలోని సోషల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎస్‌ఎస్‌ఈ) ద్వారా ప్రభుత్వం ఈ బాండ్లను విడుదల చేసి.. నిధులను సమీకరించు కోవాలని చూస్తోంది. ఇవి ప్రభుత్వాలు విడుదల చేసే రెగ్యులర్ బాండ్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.

వచ్చిన లాభాల ఆధారంగా ప్రైవేట్ భాగస్వామికి చెల్లింపు పద్ధతి ఉంటుంది. ఈ బాండ్స్ విజయవంతమైతేనే ప్రైవేట్ భాగస్వామికి చెల్లింపులు ఉంటాయి. కేంద్రం కూడా సోషల్ ఇంపాక్ట్ బాండ్లను ప్రోత్సహిస్తోంది. 2022లో ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సేవలను అందించడానికి 10 మిలియన్ డాలర్లతో నాలుగు బాండ్లను కేంద్రం ఇష్యూ చేసింది.