25-02-2025 12:00:00 AM
చైనాలోకి వూహాన్ నగరం నుంచి తాజాగా మరో ప్రమాదకర వైరస్ ఉనికిని అక్కడి గబ్బిలాల్లో కనుగొన్నట్లు వచ్చిన తాజా సమాచారం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇటీవల హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమో వైరస్) కూడా ఆ దేశంలోనే బయట పడడంలో ప్రపంచ మహమ్మారి విషజీవులకు అదొక కేంద్రం వలె కనిపిస్తున్నది. కోవిడ్-19 ధాటికి 70 లక్షలకు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా, కోట్లాదిగా ఆసుపత్రుల పాలయ్యారు.
వూహాన్ నగరంలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ ప్రయోగశాలలో శాస్త్రవేత్తల బృందం ‘హెచ్‌కెయు5 పేరున పిలుస్తున్న కొత్త వైరస్ ఉనికిని అక్కడి గబ్బిలాల్లో కనుగొనడంతో మరో వైరస్ విపత్తు వస్తుందా? అనే భయాందోళనలు అందరిలోనూ మొదలైనాయి. సార్స్-కోవ్-2 తరహాలో వ్యాప్తి చెందగల ఈ నూతన వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని గుర్తించారు.
బ్యాట్ ఉమన్ (గబ్బిలం మహిళ)గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ జెంజిల్ పరిశోధనల ఫలితాలను పూర్తిగా, లోతుగా విశ్లేషంచవలసిన అవసరం ఇంకా ఉంది. ఇదే సమయంలో గబ్బిలాల నుంచి మనుషులకు వైరస్ సంక్రమణం జరిగి కోవిడ్-19 లాంటి చేదు అనుభవాలు మళ్లీ ఎదుర్కోవలసి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (మెర్స్) అనబడే అనారోగ్యానికి దారి తీసే ఇలాంటి వైరస్‌లవల్ల ఊపిరితిత్తులు, జీర్ణనాళం ప్రభావితం కావచ్చని శాస్త్రవేత్తతలు విశ్లేషించారు.
‘హెచ్‌కెయు5- గబ్బిలం వైరస్ ‘సార్స్-కోవ్-2’ కన్న తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, కరోనా కాలంలో సిద్ధించిన ప్రభావంతో పోల్చితే, నేటి కొత్త వైరస్, వ్యాప్తి, ప్రమాదాలు కొంత తక్కువగా ఉండవచ్చని తేలింది. ఈ నూతన వైరస్ ప్రభావం అధ్యయనం చేయడానికి మరింత సమయం పట్టవచ్చునని భావిస్తన్నారు. తాజా గబ్బిలం వైరస్ కట్టడికి మనందరం కోవిడ్-19 నాటి నియమ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ ఆ దుష్ట వైరస్ బారిన పడకుండా మనలను మనం రక్షించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తున్నది.
- డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి