calender_icon.png 4 February, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలిలో కొత్తరకం దందా

04-02-2025 01:42:30 AM

  1. ఒకరి పేరుపై వాటర్ ట్యాంకర్ బుకింగ్ మరొకరికి సప్లయ్ 
  2. వినియోగదారుడి ఫిర్యాదుతో బయటపడ్డ భాగోతం
  3. ట్యాంకర్ బుకింగ్స్‌పై జలమండలి నిఘా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3(విజయక్రాంతి): జలమండలిలో కొత్తరకం దందా బయటపడింది. జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ల పరిధిలోని కొన్ని చోట్ల వినియోగదారులకు తెలియకుండానే వారిపేరుపై పలువురు వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు ట్యాంకర్లను బుక్ చేసి, ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జలమండలి పరిధిలోని ఓ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో జరిగిన ఘటనతో జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆరా తీసిన ఉన్నతాధికారులు సదరు ట్యాంకర్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించి, విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం.

దీంతో జలమండలి పరిధిలోని వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్‌పై ఎండీ అశోక్‌రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ ద్వారా దర్యాప్తును ప్రారంభించడంతో జలమండలి వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా వెలుగుచూసిన ఘటన..

మాదాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి గతంలో జలమండలి వాటర్ ట్యాంకర్‌ను బుక్ చేసుకున్నాడు. కానీ కొంతకాలానికి ఇటీవల తాను బుక్ చేసిన వాటర్ ట్యాంకర్ డెలివరీ అయిందని మాదాపూర్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆయన నివ్వెరపోయాడు. అసలు తాను బుకింగ్ చేయకున్నా డెలివరీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు.

మరో రెండు, మూడు సార్లు కూడా ఆయనకు మెసేజ్ రావడంతో అప్రమత్తమై జలమండలి అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆరా తీసిన ఉన్నతాధికారులు ఓ ట్యాంకర్ డ్రైవరే ఇదంతా చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు.

అయితే వాటర్ ట్యాంకర్లను డెలివరీ చేసే సమయంలో అతడి వద్ద ఉండే ఓ వినియోగదారుడి క్యాన్ నంబర్ ఆధారంగా అతడు గృహావసరాల కింద ట్యాంకర్‌ను రూ.500లకు బుకింగ్ చేసి, వేరే వారికి ఎక్కువ ధరకు వాటర్ ట్యాంకర్‌ను సరఫరా చేసినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

కాగా గతేడాది.. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాటర్ ట్యాంకర్ కార్డును స్కాన్ చేయకుండానే నీళ్లు నింపుకొని బయటకు వెళ్లిన దాదాపు 50 వాటర్ ట్యాంకర్లను జలమండలి విజిలెన్స్ అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వేసవి దగ్గర పడుతున్న వేళ వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతున్నందున ఎలాంటి అవకతవకలు జరుగకుండా నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మరో రెండు మూడు వారాల తర్వాత ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద జలమండలి, విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

వేసవిని ఎదుర్కునేందుకు ప్రణాళికలు

ప్రస్తుతం జలమండలి పరిధిలో రోజు వారీ వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతున్నాయి. గతేడాది జనవరితో పోల్చితే  ఈ ఏడాది జనవరిలో దాదాపు 50శాతానికి పైగా వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యాయి. దీంతో వచ్చే వేసవిని ఎదుర్కునేందుకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్‌మిట్టల్, ఉన్నతాధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

గతేడాది వేసవి ఆరంభంలో కూడా వాటర్ ట్యాంకర్ల సరఫరాలో కూడా పలు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించి గట్టి నిఘా ఉంచడంతో సమస్యను అధిగమించారు. ఈ ఏడాది వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన చోట అదనంగా ఫిల్లింగ్ పాయింట్లు, ఫిల్లింగ్ సమయాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.