02-09-2024 03:00:50 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): తెలంగాణను టూరిజం హబ్ మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న అన్ని దారులను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ, అనుభవాత్మక టూరిజం మేళవింపుతో రేవంత్ సర్కారు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది.
ఎన్నో పర్యాటక వైవిధ్యాలకు తెలంగాణ నెలవు. అంతటి ప్రాధాన్యత ఉన్న తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ ప్టెటారు. ఇందుకోసం త్వరలో తీసుకురానున్న టూరిజం పాలసీలో ఎలాంటి అంశాలను పొందుపర్చాలనే విషయాలను పర్యాటక శాఖకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం పర్యాటక శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అనుభూతిని పొందేలా పర్యటన
నూతన పాలసీలో అనుభవాత్మక పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోచిస్తున్నారు. ఒక ప్రదేశానికి వెళ్లి ఆలయాలు, కోటలు దర్శించడం, ప్రకృతి అందాలు చూడడం, ఫొటోలు దిగడానికే ఇప్పటి వరకు మన రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఉన్న అనుభవం. కానీ మనం వెళ్లిన ప్రదేశంలో ఉన్న ఆలయాలు, కోటల చరిత్ర, పాలకులు, పూజలు, స్థానిక నృత్యాలను వివరిస్తారు. ఆసక్తి ఉన్న వారికి నాటి పాలకుల వేషధారణతో ఫొటోలు దిగే అవకాశం కల్పించడం.. స్థానిక కళాకారుల తో కలిసి నృత్యంలో కాలు కదిపే అవకాశం ఇవ్వడం, స్థానికంగా ఉత్పత్తితుల తయారీలో భాగస్వామి కావడం, స్థానిక వంటకాలను నేర్చుకునే అవకాశాన్ని పర్యాటకులకు కల్పించడమే అనుభవాత్మక పర్యాటకం అంటారు. దీన్ని పటిష్టంగా అమలు చేసేలా అధికారులకు సూచనలు చేశారు.
ఆధ్యాత్మికం, చారిత్రక టూరిజం
రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రైస్తవంతో పాటు బౌద్ద, జైన ఆలయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల పరంగా ఖమ్మంలో భద్రాచలం రామాలయం, పర్ణశాల, ముజ్జుగూడెం బౌద్ధస్తూపం, వరంగల్‌లో రామప్ప ఆల యం, వేయిస్తంభాల గుడి, కరీంనగర్‌లో వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు ఆలయాలు, దూళికట్ట బౌద్ధ స్తూపం, ఆదిలాబాద్‌లో బాసర సరస్వతి, మెదక్‌లో మెదక్ చర్చి, నిజామాబాద్‌లో డిచ్‌పల్లి రామాలయం, ఆర్మూర్ సిద్దులగుట్ట.. హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోట, రంగారెడ్డిలో రాచకొండ ఆలయాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలంపూర్ జోగులాం బ, నవబ్రహ్మ ఆలయాలు, నల్గొండ జిల్లాలో
నాగార్జున సాగర్ బుద్ధవనం, యాదగిరిగుట్ట, జాన్‌పహాడ్ దర్గా, కొలనుపాక జైన ఆలయాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కాకతీయలు మొదలు నిజాం కాలం నాటి వరకు నిర్మించిన అనేక కోటలు, గడీలు ఉన్నాయి. ఆది వాసీ జాతర మేడారం సమ్మ క్క- సారలమ్మ జాతరకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
సాంస్కృతిక వైభవం
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పూలను పూజించే పండుగ బతుకమ్మ. తెలంగాణకే విశిష్టమైన ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటేలా ప్రణాళికను పర్యాటక శాఖ రూపొందిస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను ఘనంగా నిర్వహిస్తారు. దేశీయ, విదేశీ పర్యాటకులను బోనాలు, బతుకమ్మ సమయంలో దర్శించేలా చేసి, ఆటపాటల్లో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ప్రతి ఏటా ఆ సీజన్‌లో పర్యాటకులు రావడంతో పాటు మనదైన కళకు ప్రపంచవ్యాప్తంగా పేరొస్తుంది. పేరిణి, కొమ్ము నృత్యం, గుస్సాడి వంటి నృత్యాల్లో పర్యాటకులు పాలుపంచుకునేలా చేయడంతో ఆ కళాకారులకు నిత్యం ఉపాధి లభించడంతో పాటు పర్యాటకులు మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది.
బౌద్ధ స్తూపాల వద్ద మౌలిక సదుపాయాలు
బౌద్ధం పుట్టిన నేల భారతదేశమే. శ్రీలంక, భూటాన్, మయన్మార్, కాంబోడియాలో బౌద్ధం అధికారిక మతం. చైనా, జపాన్, మంగోలియా, థాయిల్యాండ్, లావోస్, వియత్నాం, మలేషియా దేశాల్లో బౌద్ధ మతానికి బాగా ఆదరణ ఉంది. ఆయా దేశాల నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు మన దగ్గరకు సందర్శనకు వస్తుంటారు. వారిని మరింతగా ఆకర్షించేందుకు హైదరాబాద్ ట్యాంక్ బండ్‌లోని బుద్ధుని విగ్రహం, నాగార్జున సాగర్ బుద్ధ వనం, దూళికట్ట, ముజ్జుగూడెం, ఫణిగిరి బౌద్ద స్తూపాల వద్ద మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, నాగార్జున సాగర్‌కు హైదరాబాద్ నుంచి నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పర్యావరణ పర్యాటకానికి పెద్దపీట
ప్రకృతి రమణీయతకు తెలంగాణ ప్రసిద్ధి. ప్రతి జిల్లాలోనూ జలపాతాలు, అడవులు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో కుంటాల, పొచ్చెర, గాయత్రి, ఖమ్మంలో బొగత, వెన్నెల, వరంగల్‌లో భీమునిపాదం, కరీంనగర్‌లో సబ్బితం, రాయికల్, నిజామాబాద్‌లో సిర్నాపల్లి, మెదక్‌లో పోచారం జలపాతం, నల్గొండలో ఎత్తిపోతల జలపాతం, రంగారెడ్డిలో నానాజీపూర్, మహబూబ్‌నగర్ జిల్లాలో మల్లెలతీర్థం జలపాతాలు, హైదరాబాద్‌లో నెహ్రూ జూ పార్క్ ఉన్నాయి. మౌలిక వసతుల లేకపోవడంతో ఇవేవి పర్యాటకుల ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు వీటన్నింటిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ వెలుపల వెయ్యి ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నైట్ సఫారీకి ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాచకొండ గుట్టల్లో మునుగోడు సమీపంలోని లోయలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
హైదరాబాద్ బిర్యానీ.. అంకాపూర్ చికెన్..
ఆహారపు అలవాట్లలోనూ తెలంగాణకు ప్రత్యేకత ఉంది.హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధి. పర్యాటకులకు హైదరాబాద్ బిర్యానీ రుచి చూపించడంతో పాటు దానిని ప్రమాణాలతో వండే విధానం చూపిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ చికెన్, కరీంనగర్ సర్వపిండి, సకినాలు, గారెలు, సత్తుముద్దలు, భద్రాచలం బొంగు చికెన్ ఇలా ప్రతి చోట ఆహార వైవిధ్యం ఉంది. వాటి రుచులను పర్యాటకులకు చూపడంతో పాటు ఆసక్తి ఉన్న వారికి వండడాన్ని చూపుతారు. దీంతో తెలంగాణ రుచులకు ప్రపంచస్థాయి బ్రాండింగ్ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
తెలంగాణ జానపదం..
పల్లెపల్లెనా జానపదం పల్లవించే నేల తెలంగాణ. సాయుధ పోరాట కాలం నుంచే పాటలు తెలంగాణ జీవనంలో భాగమయ్యాయి. మలి దశ పోరులోనూ పాటలు పోరు బాటకు దారి దీపమయ్యాయి. సుద్దాల హనుమంతు, గద్దర్, అందెశ్రీ వంటి వారు వేసిన ఒరవడిలో వేలాది మంది కవులు, కళాకారులు జానపదాల రచన, ఆలాపనలో ముందుకు సాగుతున్నారు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వీక్షకులు తెలంగాణ పల్లె పాటలను ఆస్వాదిస్తున్నారు. ఈ జానపద కళాకారులకు సరైన వేదిక కల్పించి వారికి ఉపాధి అవకాశాలు చూపడంతో పాటు తెలంగాణ జానపదాల కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది.